వైఎస్ షర్మిల, సునీత ఇద్దరూ కలిసి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి జడుపు పుట్టిస్తున్నారో తెలుసుకోవడానికి ఇది పెద్ద ఉదాహరణ! కడప ఎంపీ నియోజకవర్గ పరిధిలో వారు చాలా దూకుడుగా సాగిస్తున్న ఎన్నికల ప్రచారంతో జగన్ దళం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వైఎస్ అవినాష్ రెడ్డి చిన్నాన్న వివేకానందరెడ్డిని చంపిన హంతకుడు అని, అలాంటి హంతకులను పార్లమెంటుకు పంపడానికి వారికి అండదండగా జగన్మోహన్ రెడ్డి నిలుస్తున్నారు అని తీవ్ర స్థాయిలో వారు విమర్శలు గుప్పిస్తున్నారు. కడప బరిలో నిల్చుని వారిద్దరూ చేస్తున్న ప్రచారానికి కేవలం కడప నియోజకవర్గంలో మాత్రమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పరువు పోతున్నదని పార్టీ నాయకులు బదనాం అవుతున్నారని వారు భయపడుతున్నారు. అందుకే కడప జిల్లా కోర్టును ఆశ్రయించి ఒక గాగ్ ఆర్డర్ తీసుకువచ్చారు. ‘ఈనెల 30వ తేదీ వరకు వివేకానంద రెడ్డి హత్య గురించి బహిరంగంగా ఎక్కడ ప్రస్తావించకూడదు’ అనేది కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఈ గ్యాగ్ ఆర్డర్ లోని సారాంశం. ఆరోజు ఉన్న తర్వాతి వాయిదాలో తీర్పు ఉంటుంది. నారా లోకేష్ చంద్రబాబు నాయుడు వైయస్ షర్మిల, సునీత లను ఉద్దేశించి ఆదేశాలు జారీ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్, పురందేశ్వరి, బీటెక్ రవి వీరికి కూడా తమ అనుచరులు పార్టీ నాయకులు కూడా ఎక్కడా ఈ విషయాలు మాట్లాడకుండా చూడాలని ఆదేశాలలో పేర్కొన్నారు.
ఆదేశాలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా కోరుకుంటుందో అలాగే వచ్చాయి. కానీ ఈ ఆదేశాలతో వారు షర్మిల, సునీత చేసే విమర్శల దూకుడుకు అడ్డుకట్ట వేయగలరా అనేది ప్రజలలో మెదలుతున్న సందేహం. ఇలాంటి ప్రయత్నం అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడానికి చేసేదిగా కనిపిస్తోందని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పటికే కడప జిల్లా కోర్టు ఆదేశాల మీద హైకోర్టును ఆశ్రయించబోతున్నట్లుగా వివేకానంద రెడ్డి కూతురు సునీత ప్రకటించారు. ఆమె పులివెందుల నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి అడిగే ప్రచారంలో తన తండ్రి హత్యను ప్రస్తావించినా కూడా అది బహిరంగ ప్రసంగాలు కిందికి వస్తుందో రాదో తర్వాత సంగతి.. మొత్తానికి ఆమె హైకోర్టును ఆశ్రయించబోతున్నారు! అయితే షర్మిల ఈ కోర్టు ఆదేశాలకు తలొగ్గుతారా అనేది కూడా గమనించాల్సిన అంశం. ఒకవేళ కోర్టు ఉత్తర్వులను కూడా ధిక్కరించి షర్మిల తన ప్రసంగాలలో బహిరంగ వేదికల మీద నుంచి వివేకానంద రెడ్డి హత్య అంశాన్ని ప్రస్తావిస్తే ఏమవుతుంది? ఆమె మీద కేసులు నమోదు చేస్తారా? ఆమెను అరెస్టు చేసి జైల్లో పెడతారా? ఏం జరుగుతుంది? అనే పరిణామాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి.
షర్మిల మీద చర్య తీసుకునే విధంగా ఏ పోలీసు ప్రక్రియ జరిగినా సరే అది కూడా ఆమెకు మరికొంత అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉంది. న్యాయం కోరుతూ ఉన్నప్పుడు తనను అక్రమంగా నిర్బంధిస్తున్నారంటూ మరోసారి షర్మిల గళం ఎత్తితే ఎంపీ బరిలో ఉన్న ఆమెకు మరింత సానుభూతి లభించే అవకాశం కూడా ఉంది. ఈ గ్యాగ్ ఆర్డర్ ద్వారా వారి నోరులకు తాళాలు వేయించడం సంగతి ఏమోగానీ, వారు మరింతగా రెచ్చిపోతే చర్యలు తీసుకోవడం ద్వారా వారికే మేలు జరుగుతుంది అని ప్రజలు అనుకుంటున్నారు.
అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపుతారా?
Wednesday, January 22, 2025