షర్మిల ఫ్యామిలీ ప్యాకేజీకి నో అన్నందుకే..

Sunday, April 28, 2024

వైయస్సార్ తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం అనే  ప్రతిపాదన అటకెక్కినట్లే.  కర్ణాటక ఉప ముఖ్యమంత్రి,  పార్టీలో ఢిల్లీలో కూడా చక్రం తిప్పగల కీలక నాయకుడు డీకే శివకుమార్ ద్వారా మంతనాలు సాగించి, కాంగ్రెస్లో విలీనం కావడానికి షర్మిల ప్రయత్నించారు.  ఆమె తెలంగాణ రాజకీయాలలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని..  ఇక్కడి నాయకులు కొందరు అభ్యంతరాలు చెప్పడంతో..  అధిష్టానం ఒక పట్టాన నిర్ణయం తీసుకోలేక పోయింది.  తాజాగా వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో షర్మిల మాటలను గమనిస్తే విలీనం అనే ప్రతిపాదన ఆటకెక్కినట్లే అని అర్థమవుతుంది. 

 రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేస్తుందని,  పార్టీ టికెట్ కోరుకునే ఆశావహులు దరఖాస్తు చేసుకోవాలని షర్మిల ప్రకటించారు.  అదే సమయంలో తమ కుటుంబం నుంచి తల్లి విజయమ్మ,  భర్త బ్రదర్ అనిల్ కుమార్ కూడా పోటీ చేస్తారని షర్మిల చెప్పుకొచ్చారు.  ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయనున్నట్లు  చాలా కాలం నుంచే ప్రకటిస్తున్న షర్మిల,  ఆ నియోజకవర్గంలో పాటు మరోచోట నుంచి కూడా బడిలోకి దిగనున్నట్లు వెల్లడించడం విశేషం.  అయితే తాను రెండు నియోజకవర్గాలలో పోటీ చేయాలనేది,  తన కుటుంబం నుంచి మరో ఇద్దరు సభ్యులు కూడా ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనేది..  తమ పార్టీ కార్యకర్తల,  తెలంగాణ ప్రజల నుంచి వినవస్తున్న డిమాండ్ అంటూ షర్మిల అభివర్ణించడం తమాషా!

 కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలనే ప్రతిపాదన ఎందుకు మంట కలిసిపోయిందో..  ఆమె మాటల్లోనే సమాధానం కనిపిస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.   విలీనం జరిగితే షర్మిల పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికే,  కాంగ్రెసులో అనేక అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.  అలాంటిది షర్మిల తాను ఢిల్లీ వెళ్లి సోనియా,  రాహుల్ గాంధీలను కలిసినప్పుడు..  తన కుటుంబం మొత్తానికి ప్యాకేజీలుగా మూడు టికెట్లు కావాలని అడిగి ఉంటారని..  దానికి సోనియా గాంధీ నో చెప్పడంతోనే..  విలీనం ఆగిపోయి ఉంటుందని ప్రజలు ఇప్పుడు అంచనా వేస్తున్నారు.

పాలేరులో పోటీ చేయాలని చాలా గట్టిగా భావించిన షర్మిలకు అక్కడి వాతావరణం సానుకూలంగా లేదనే సంగతి అర్థమైంది.  కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే ఆ స్థానం కోసం..  తుమ్మల నాగేశ్వరరావు,  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే ఆమె తన కోసం మరో నియోజకవర్గం కూడా చూసుకోవాలని జాగ్రత్త పడుతూ..  అదేదో తెలంగాణ ప్రజల అభిలాష అన్నట్లుగా బిల్డప్ ఇవ్వడం నవ్వుల పాలు చేస్తుందని ప్రజలు అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles