కాంగ్రెస్ లో నిత్య అసంతృప్తి నేతగా పేరొందిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పార్టీ అధిష్ఠానం ఝలక్ ఇచ్చింది. తమ్ముడిని బిజెపిలోకి పంపి, ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెస్ ప్రచారంకు దూరంగా ఉండటమే కాకుండా, కాంగ్రెస్ ఓడిపోతుందని ముందుగానే చెప్పేసిన వెంకటరెడ్డి పత్తి పార్టీ తన ఆగ్రహాన్ని వ్యక్తపరచింది.
పైగా, పార్టీ సుప్రీం లీడర్ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణ పర్యటనకు వస్తే అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినా ఆయనతో ఇక పార్టీకి సంబంధం లేదనే సంకేతం ఇచ్చింది. తెలంగాణ కాంగ్రెస్‌ను సమూలంగా ప్రక్షాళన చేస్తూ. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లాల కమిటీల వరకు సుమారు 80 మంది నేతలకు పార్టీ పదవుల ఇశ్తూ అధిష్టానం జారీ చేసిన ఉత్తర్వులలో వెంకటరెడ్డికి మొండిచేయి చూపారు.
నిన్నమొన్నటి వరకు టిపిసిసి ప్రచార కమిటీలో స్టార్ క్యాంపెయినర్‌గా పార్టీలో ఓ వెలుగు వెలిగిన కోమటిరెడ్డి వెంకట రెడ్డిని ఈసారి పూర్తిగా పక్కన పెట్టారు.ఏ కమిటీలోనూ ఆయనకు స్థానం కల్పించలేదు. ఇప్పటి వరకు కోమటిరెడ్డి సోదరులు బహిరంగంగా వ్యతిరేకిస్తూ, ఆ పదవి తమకే ఇవ్వాలని పట్టుబడుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పట్ల పార్టీ అధిష్ఠానం ఈ కమిటీల ద్వారా సంపూర్ణ విశ్వాసం ప్రకటించినట్లు అయింది. ఆయన సన్నిహితులు అందరికి కీలక పదవులు లభించాయి.
ఇప్పటి వరకు వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యవహరిస్తున్న మాజీ మంత్రి జె. గీతారెడ్డిని తొలగించారు. రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా వ్యవహరించనున్న 40 మంది కార్యనిర్వాణ కమిటీలో సభ్యురాలిగా గీతారెడ్డికి స్థానం కల్పించారు. మాణిక్యం ఠాగూర్‌ను పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తూ పద్దెనిమిది మందితో కమిటీని ఏర్పాటు చేశారు.
వారితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అంజన్ కుమార్ యాదవ్, జగ్గారెడ్డి, అజహరుద్దీన్, మహేశ్ గౌడ్ లను నియమించారు. జనరల్ సెక్రటరీలుగా ఎనిమిది మంది, కార్యానిర్వహాక కమిటీలో 40 మంది, జిల్లా అధ్యక్షులుగా 24 మంది, వైస్ ప్రెసిడెంట్లుగా 24 మందిని ఎఐసిసి నియమించింది.
గత కొద్దిరోజులుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పాటు.. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించారని, బీజేపీ నేత, తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికి సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం షోకాజు నోటీసులు జారీచేసింది. దానికి ఆయన వివరణ కూడా ఇచ్చారు.
తమ్ముడు ఉపఎన్నికలో ఓటమి చెందడంతో బీజేపీలో చేరడానికి వెంకటరెడ్డి సంశయంలో ఉన్నాడని, ఇప్పటికే బీజేపీలో తమ్ముడు తనను ఎన్నికల తర్వాత ఎవ్వరు పట్టించుకోవడం లేదని అసంతృప్తితో ఉండడంతో వెంకటరెడ్డి ఆ పార్టీలో చేరేందుకు కొంచెం వెనుకాడుతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఎన్నికల నాటికి రాష్ట్రంలో బిజెపి పుంజుకొంటే చేరవచ్చులే అనే ధోరణిలో ప్రస్తుతంకు మౌనంగా ఉన్నట్లు భావిస్తున్నారు.
అయితే, తన యాత్ర సమయంలో కనీసం కనిపించకపోవడంతో రాహుల్ గాంధీ ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్నారు. అందుకనే అతనితో పార్టీకి సంబంధం లేదన్న ధోరణితో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నది. కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డికి పిసిసిలో పూర్తి అధికారాలు ఇస్తున్నట్టు స్పష్టం అవడంతో కాంగ్రెస్ లో కొనసాగడం సహితం ఇక కష్టం కావచ్చనే అభిప్రాయం నెలకొన్నది.
గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి వంటి వారు సహితం సాహసింపని రీతిలో తమ నియోజకవర్గాల్లో తమ ప్రత్యర్థులను రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తూ ఉండడంతో కోమటిరెడ్డి సోదరులు మొదటి నుండి అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. దానితో వచ్చే ఎన్నికలలో తెలంగాణాలో బిజెపి తన జెండా ఎగరవేయలేని పక్షంలో కోమటిరెడ్డి సోదరులకు రాజకీయ భవిష్యత్ మూసుకు పోతున్నట్లే అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.