పెద్దిరెడ్డిపై చంద్రసర్కార్ స్పెషల్ ఫోకస్!

Monday, July 8, 2024

చంద్రబాబునాయుడు సొంత ప్రాంతమైన ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఇటీవలి ఎన్నికల ఫలితాలను గమనిస్తే.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం తప్ప.. మిగిలిన జిల్లా మొత్తం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాషవుట్ అయిపోయింది. సాధారణంగా చిత్తూరు జిల్లా వైసీపీకి బలం ఉన్న జిల్లాగా పేరుండేది. రాష్ట్రంలో జగన్ సర్కారు ఓడిపోయినా సరే.. ఈ జిల్లాలో అంతో ఇంతో సీట్లు దక్కుతాయనే అభిప్రాయమే అందరికీ ఉండేది. 2019లో కూడా ఒక్క కుప్పం మినహా తెలుగుదేశం ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఈసారి తెదేపా సగం వరకు గెలుస్తుందని అనుకున్నారు. కానీ ఆ పార్టీ జిల్లా మొత్తాన్ని స్వీప్ చేసింది. సొంత జిల్లాలో చంద్రబాబునాయుడు హవాకు ఎదురొడ్డి నిలిచిన ఏకైక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రమే. తాను గెలవడం మాత్రమే కాదు, అనూహ్యంగా తంబళ్లపల్లెలో తన తమ్ముడు ద్వారక నాధరెడ్డిని, రాజంపేట ఎంపీగా తన కొడుకు  మిథున్ రెడ్డిని కూడా గెలిపించుకోగలిగారు.

అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఇప్పుడు చంద్రబాబునాయుడు స్పెషల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఆయన హవాకు గండికొట్టడం మాత్రమే కాదు. గత అయిదేళ్ల ప్రభుత్వంలో కీలకమైన మంత్రిగా చేసిన సకల అవినీతి, అరాచక వ్యవహారాలను బయటకు తీసి పెద్దిరెడ్డిని జైలుకు పంపాలని కూడా చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్ సర్కారులో గనుల శాఖ మంత్రిగా, పంచాయతీ రాజ్ మంత్రిగా చాలా కీలక బాధ్యతలు చూశారు. ఇసుక దందాలకు తెరలేపిన నూతన ఇసుక విధానం మొత్తం ఆయన రూపకల్పన చేసినదే. ఇసుక వ్యాపారంలో దందాలకు కేంద్రబిందువైన ప్రెవేటు కంపెనీలు పెద్దిరెడ్డి బినామీలవే అనే ఆరోపణలు పుష్కలంగా ఉన్నాయి. అదే సమయంలో.. దేశవ్యాప్తంగా ఆన్‌లైన్, డిజిటల్, యూపీఐ పేమెంట్లకు అవకాశం లేకుండా కేవలం నగదు పేమెంట్ల మాత్రమే జరిగిన ఏకైక వ్యాపారం ఏపీలో ఇసుక దందా మాత్రమే. కొంత ప్రాంతానికి ఇసుక తవ్వే పర్మిషన్లు తీసుకుని.. అంతకు అనేక రెట్లు అనుమతిలేని ఇతర ప్రాంతాల్లో కూడా ఇసుక తవ్వేయడం, ఒక లారీ పర్మిట్ మీద పదుల సంఖ్యలో లారీల్లో ఇసుక తరలించడం ఇలా వేల కోట్ల అవినీతి ఈ ఇసుక దందాలో జరిగింది. ఆ దందాలు యావత్తూ గనుల శాఖ కిందికే, పెద్దిరెడ్డి పరిధిలోకి వస్తాయి. ఈ శాఖ మీద ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఆ శాఖలో కీలక అధికార్లకు లీవులు కూడా ఇవ్వవద్దని, అక్కడి ఫైళ్లు అన్నీ స్వాధీనం చేసుకోవాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు అధికారంలోకి రాగానే.. అసలు చర్యలు మొదలవుతాయని.. అధికార్ల దగ్గర మొదలు పెట్టి.. పెద్దిరెడ్డిని కటకటాల వెనక్కు పంపేవరకు చర్యలు కొనసాగవచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles