ఇంటింటికి డబ్బులు పంచిపెట్టి, అదే అభివృద్ధి అని మాయ చేయడాన్ని జగన్మోహన్ రెడ్డి తన బాటగా ఎంచుకున్నారు. అయితే ప్రజలు నెమ్మదిగా జాగృతం అవుతున్నారు. సంక్షేమ పథకాల ముసుగులో యావత్తు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంతగా అధోగతి పాల్జేస్తున్నారో ప్రజలు గుర్తిస్తున్నారు. ఏకంగా రెండు లక్షల కోట్ల పైచిలుకు అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇప్పటికే ఎంత ప్రమాదకర పరిస్థితిలోకి జగన్ నెట్టి వేశారో ప్రజలందరూ నెమ్మదిగా అర్థం చేసుకుంటున్నారు. ఇలాంటి నేపద్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఎప్పటికీ చెప్పడానికి సాహసం చేయలేని ఒక హామీని చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే- ఇప్పుడు అమలవుతున్న అన్ని రకాల సంక్షేమ పథకాలను మరింత మెరుగ్గా, మరింత ఎక్కువమంది లబ్ధిదారులకు, మరింత సమర్ధంగా, మరింత పారదర్శకంగా అందజేస్తామనేది చంద్రబాబు నాయుడు తొలి నుంచి చెబుతున్న హామీ! అయితే ఆర్థిక వనరులపరంగా రాష్ట్రాన్ని స్వావలంబన దిశగా నడిపిస్తానని ఆయన అంటున్నారు. సంపదను సృష్టించడం ఎలాగో తనకు తెలుసునని, అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో మరొక పారిశ్రామిక విప్లవం తీసుకువచ్చి సంపదను సృష్టించడం ద్వారా అన్ని రకాల సంక్షేమ పథకాలను కొరత లేకుండా అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు అంటున్నారు. అప్పులు తీసుకువచ్చి బటన్ నొక్కి డబ్బులు పంచడం గొప్ప విషయం కానీ కాదని జగన్ తీరును ఆయన ఎద్దేవా చేస్తున్నారు!
చంద్రబాబు నాయుడు మాటలు ప్రజలను ఆలోచింపజేస్తున్నాయి. జగన్ సర్కారు నిర్దిష్టమైన అభివృద్ధి రూపేణా ఒక్కటంటే ఒక్క పని కూడా చేసింది లేదు. సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచి పెట్టడం తప్ప రాష్ట్రానికి ఆర్థిక వనరులు పెంపొందే దిశగా జగన్ ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేదు. రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను, ఏర్పాటుకు సిద్ధమవుతున్న పరిశ్రమలను అందరినీ కూడా తమ తమ దందాలతో బెదరగొట్టి రాష్ట్రం నుంచి వెళ్ళిపోయేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పరిశ్రమలని తీసుకురావడం, సంపద సృష్టించడం అనేది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి చేతకాని విద్య అని ఈ ఐదేళ్లలో స్పష్టంగా నిరూపణ అయింది. సరిగ్గా అక్కడే చంద్రబాబు నాయుడు కూడా తన గేమ్ ప్లాన్ అమలు చేస్తున్నారు. తను సంపదను సృష్టించి పథకాలు అమలు చేస్తానని ఆయన హామీ ఇస్తున్నారు.
జగన్ చెప్పలేని మాటతో చంద్రబాబు దూకుడు!
Wednesday, January 22, 2025