సీనియర్లకు సర్దిచెప్పడంలో చంద్రబాబు సక్సెస్

Friday, July 5, 2024

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. చంద్రబాబునాయుడు గతంలో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన మూడు పర్యాయాల్లో ఇప్పుడున్నంతటి విలక్షణమైన కేబినెట్ కూర్పు ఎన్నడూ లేదు. ఈసారి పార్టీ అధికారంలోకి వస్తే.. తమకు మంత్రి పదవి గ్యారంటీ అని బలంగా నమ్మిన అనేకమంది సీనియర్లకు చాన్సు దక్కలేదు. కేవలం సీనియారిటీ కారణం మాత్రమే  కాదు. పార్టీ ప్రతిపక్షంలో ఉంటూ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీని వెన్నంటి ఉంటూ జగన్ సర్కారు మీద పోరాటాలు సాగించినందుకు కూడా మంత్రి పదవుల ఎంపికలో తాము ముందు వరుసలో ఉంటామని వారంతా అంచనా వేశారు. కానీ, అన్ని అంచనాలూ తప్పాయి. చాలా మంది సీనియర్లకు పదవులు దక్కలేదు. 24 మంది ఉన్న కేబినెట్ లో చంద్రబాబు ఏకంగా 17మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. అంతకంటె గొప్ప విజయాన్ని కూడా ఆయన సాధించారు. అదేంటంటే.. ఈ కేబినెట్ కూర్పు మీద సీనియర్లు ఎవ్వరిలోనూ అసంతృప్తి లేకుండా సర్దిచెప్పడం!

ఉదాహరణకు అయ్యన్నపాత్రుడు! పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పడు వెన్నంటి ఉన్న పలువురిలో ఆయన కూడా ఉన్నారు. నిజానికి జగన్ అయ్యన్నను, ఆయన కొడుకును కూడా టార్గెట్ చేశారు. వారిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించారు. న్యాయపరిజ్ఞానం ఉన్న సీనియరు గనుక.. జగన్ పంజాకు చిక్కకుండా అయ్యన్న తప్పించుకున్నారు. అలాంటి అయ్యన్నకు కూడా పదవి దక్కలేదు. ఆయన కూడా ఇప్పుడు జూనియర్లకు పదవులు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంత సీనియారిటీ వచ్చిన తర్వాత.. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే ఎక్కువ, మంత్రి పదవులంటే ఎలా? అని చెబుతున్నారు. జూనియర్లకు అవకాశాలు రావాలి కదా అంటున్నారు. ఇదే భావనను సీనియర్లు అందరిలోనూ కలిగించడంలో చంద్రబాబునాయుడు కృతకృత్యులు అయినట్టే కనిపిస్తోంది.

పదవులు ముఖ్యం కాదు.. రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. మళ్లీ పార్టీని ప్రజలు గెలిపించేలా వారి గౌరవాన్ని కాపాడుకోవడం ముఖ్యం అనేదిశగా చంద్రబాబు వ్యూహం సాగుతోంది. పదవులు పొందలేకపోయిన సీనియర్లలో యనమల రామకృష్ణుడు, నక్కా ఆనంద బాబు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కళా వెంకట్రావు, పితాని సత్యనారాయణ, చినరాజప్ప, మండలి బుద్ధప్రసాద్, అమర్నాధ్ రెడ్డి, కాలువ శ్రీనివాసులు తదితరులు అనేకమంది ఉన్నారు. అయితే వారిలో ఏ ఒక్కరు కూడా ఇప్పటిదాకా అసంతృప్తి మాట ఎత్తకపోవడమే చంద్రబాబు సక్సెస్ గా కనిపిస్తోంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles