ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నామినేటెడ్ పదవుల రెండో జాబితాను ప్రకటించారు. మొత్తం 59 మందితో వివిధ కార్పొరేషన్ పదవులకు సారథులను ప్రకటించారు. ఈ జాబితాలో పొత్తు ధర్మానికి పెద్దపీట వేస్తూ జనసేన, బిజెపి పార్టీలకు చెందిన వారికి కూడా కీలక కార్పొరేషన్ పదవులను కట్టబెట్టడం విశేషం. ప్రధానంగా ఎన్నికల సమయంలో పొత్తులు విజయవంతం కావడం కోసం త్యాగాలు చేసిన వారికి.. పార్టీ విజయం కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇచ్చారు.
రెండో జాబితాలో ఇద్దరికి మాత్రం కేబినెట్ హోదాతో పదవులు కట్టబెట్టారు. నర్సాపురానికి చెందిన తెలుగుదేశం నాయకుడు మహ్మద్ షరీఫ్ కు మైనారిటీ వ్యవహారాలకు ప్రభుత్వ సలహాదారు పదవి ఇస్తూ కేబినెట్ ర్యాంకు కల్పించారు. అలాగే.. ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావుకు స్టూడెంట్ ఎథిక్స్ అండ్ వేల్యూస్ అంటూ నైతికవిలువల సలహాదారుగా పదవిని కేబినెట్ ర్యాంకుతో ఇచ్చారు.
మిగిలిన వారిలో ఎమ్మెల్యే టికెట్ పొందలేకపోయిన వారు, తమ సీటును పొత్తు పార్టీల కోసం త్యాగం చేసిన వారు రకరకాలుగా ఉన్నారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ మిషన్ కు పట్టాభిరామ్, ఏపీ కల్చరల్ మిషన్ కు తేజస్వి, ఫైబర్ నెట్ కు జీవీ రెడ్డి, ఫారెస్ట్ డెవలప్మెంట్ కు సుజయకృష్ణ, గ్రంథాలయ పరిషత్ కు జి కోటేశ్వరరావు నియమితులయ్యారు. తిరుపతికి చెందిన నరసింహ యాదవ్, నీలాయపాలెం విజయకుమార్, గుంటూరు వెస్ట్ టికెట్ ఆశించి భంగపడిన మండవ మోహనక్రిష్ణ, ఆనం వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉండవిల్లి శ్రీదేవి, కిడారి శ్రావణ్ లాంటి వారందరూ రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవులు పొందిన వారిలో ఉన్నారు.
కేవలం పొత్తు ధర్మానికి పెద్ద పీట వేస్తూ ఎవ్వరిలోనూ అసంతృప్తి రేగకుండా నామినేటెడ్ పదవుల జాబితాను రూపొందించడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీల సమతూకం మాత్రమే కాకుండా కులాల సమతూకం కూడా చక్కగా పాటించారని అంటున్నారు. పదవుల్లో బీసీలకు పెద్దపీట వేశారని చెబుతున్నారు. మొత్తానికి రెండు జాబితాల నామినేటెడ్ పదవులతో చాలా మంది నాయకులను ఎన్డీయే కూటమి ప్రభుత్వం సంతృప్తి పరచినట్లయింది.
భళా బాబు : పొత్తు ధర్మానికి పెద్దపీట!
Wednesday, January 22, 2025