టీ-టీడీపీలోకి త్వరలో సీనియర్ల చేరికలు!

Saturday, May 18, 2024

ఇదివరకటి సారథుల్లాగా కాకుండా.. రాజకీయాల్లో కొంత దూకుడుగా వ్యవహరించగల, పార్టీని ముందుకు నడిపించడంలో తన ముద్రను చూపించగల చురుకైన బీసీ నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ చేతికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు అప్పగించినప్పడు.. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఒక మాట అన్నారు. తెలంగాణలో పార్టీని పూర్వవైభవం దిశగా తీసుకువెళ్లాలని ఆయన పిలుపు ఇచ్చారు. కాసాని ఏకంగా.. రెండు రాష్ట్రాల్లోనూ తెలుగుదేశం రాబోయే ఎన్నికల్లోనే అధికారంలో వస్తుందని కూడా అన్నారు. అంటే తెలంగాణ తెలుగుదేశం తరఫున ఆయన చాలా పెద్ద హామీ ఇచ్చినట్టు లెక్క. 

2023లో జరగాల్సి ఉన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి అధికారంలోకి రాకపోవచ్చు గాక.. కానీ 2018 ఎన్నికలకంటె ఖచ్చితంగా పరిస్థితి మెరుగ్గా ఉంటుందని పలువురు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు కూడా ఇప్పుడు తెలంగాణ పార్టీపై కాస్త ఫోకస్ పెంచారు.  దానికితోడు, కాసాని నేతృత్వంలో పార్టీకి కొంత దూకుడు, పూర్వస్థాయిలో ప్రజాసమస్యలపై పోరాడే పటిమ మళ్లీ వస్తాయని వాటి వెంబడి విజయాలు కూడా వరిస్తాయని అనుకుంటున్నారు. 

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తెలంగాణ తెలుగుదేశం పని ప్రస్తుతం అయిపోయిందని ప్రత్యర్థులు ప్రచారం చేస్తుంటారు. కానీ వాస్తవంలో.. మరి కొన్ని నెలల వ్యవధిలో తెలంగాణ తెలుగుదేశంలోకి కొత్తగా చేరికలపర్వం మొదలువుతుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. కొత్తవారిలో కూడా తెలుగుదేశం నమ్మకం కలిగించబోతోందని పలువురు అంటున్నారు. కేవలం కొత్తవారు మాత్రమే కాదు.. గతంలో తెలుగుదేశంలో ఉండే.. రకరకాల కారణాల నేపథ్యంలో తెరాసలోకి ఇతర పార్టీల్లోకి వలస వెళ్లిన వారు కూడా తిరిగి తెలుగుదేశం లోకి వస్తారని అంచనాలు నడుస్తున్నాయి. ఈ మేరకు గులాబీ పార్టీలోని కొందరు మాజీ తెలుగుదేశం సీనియర్లు ఇప్పటికే చంద్రబాబుతో టచ్ లో ఉన్నట్టు సమాచారం. 

ఇలా తెలుగుదేశానికి చెందిన సీనియర్ల గతంలో పార్టీ మారినా, ఇప్పుడు తిరిగి మాతృసంస్థ తెలుగుదేశంలోకి రావడానికి ఉత్సాహం చూపిస్తుండడానికి కూడా వారి కారణాలు వారికి ఉన్నాయి. వారి వారి నియోజకవర్గాల్లో పరిస్థితులు వారికి అనుకూలంగా ఉండడం లేదు. కేసీఆర్– ఇప్పుడు జాతీయ పార్టీగా మారుతున్న క్రమంలో వేర్వేరు అవసరాలకోసం వామపక్షాలతో పొత్తు వంటి ప్రయత్నాలకు వెళుతున్నారు. అవన్నీ కొందరు మాజీ టీడీపీ సీనియర్ల అవకాశాలకు గండికొట్టనున్నాయి. ఇలాంటి నేపథ్యంలో వారు మళ్లీ తెలుగుదేశం వైపే చూస్తున్నట్టు తెలుస్తోంది. కారణాలు ఏమైనప్పటికీ.. తెలంగాణ తెలుగుదేశం వెంటనే అధికారంలోకి వచ్చేంత కాకపోయినా.. గత ఎన్నికల నాటి పరాభవం కంటె మెరుగ్గా.. బాగుపడే సూచనలు, బలం పుంజుకునే సంకేతాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles