ఆల్ ది రోడ్స్ లీడ్స్ టూ రోమ్.. అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంటుంది. అన్ని మార్గాలు కూడా రోమ్ నగరానికే తీసుకువెళతాయని దానికి అర్థం. ఆ విధంగా ఇప్పుడు.. జగన్ ప్రభుత్వ హయాంలో కొత్తగా తెచ్చిన లిక్కర్ విధానంలో ఎలాంటి దోపిడీ జరిగింది? ఎంతమేర కాజేశారు? ఎవరి ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది? అనే రకరకాల ప్రశ్నలు ఎదురైనప్పుడు అందరి వేళ్లూ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి! ఎవరికోసం ఈ దందా సాగింది అంటే మాత్రం అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని తేలుతోంది.
ఇవేమీ తెలుగుదేశం నాయకులు.. ప్రతిపక్షం మీద అక్కసు పట్టలేక చేస్తున్న ఆరోపణలు కాదు. జగన్ లిక్కర్ పాలసీ, ఆ రూపంలో జరిగిన వ్యాపారం, జరిగిన దందా మీద ఏపీ సీఐడీ సుదీర్ఘంగా జరిపిన దర్యాప్తులో నిగ్గుతేల్చిన విషయాలు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డిని ఒక టూల్ గా వాడుకుంటూ.. రాష్ట్రంలో లిక్కరు దందాను మొత్తం మిధున్ రెడ్డి నడిపించినట్లుగా దర్యాప్తు తేలుస్తోంది.
వీరు చేసిన పనెల్లా ముందుగా మద్యం ఉత్పత్తి చేసే డిస్టిలరీలను లోబరచుకున్నారు.
బినామీ పేర్లతోను, సబ్ లీజులతోను దక్కించుకున్నారు. అధికారికంగా తమ పేర్లు బయటకు రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దక్కిన వాటిని తమ చేతిలోకి తీసుకున్నారు. కుదరనప్పుడు వారితో డీల్ మాట్లాడుకున్నారు. ఒక్కో కేసు మీద రూ.150 నుంచి రూ.450 వరకు రకరకాలుగా తమ వాటా ముట్టజెప్పాల్సిందేనని టార్గెట్లు పెట్టారు. మద్యం కంపెనీలకు విధిగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి.
ఎందుకంటే.. వారికి ఆమేరకు వాటాలు ఇచ్చిన వారికి మాత్రమే.. మద్యం షాపులనుంచి ఆర్డర్లు వచ్చాయి. వాటాలకు ఒప్పుకోని వారికి అసలు సేల్స్ లేకుండా ఆర్డర్లే ఇవ్వలేదు. దీంతో అందరూ లోబడ్డారు. ఈ వ్యవహారం మొత్తం పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగినట్టుగా దర్యాప్తు అధికారులు తేల్చడం విశేషం.
అదే సమయంలో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని పలువురు పెద్దతలకాయల పాత్ర కూడా ఉంది. ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి అల్లుడు కూడా బినామీల ద్వారా ఒక డిస్టిలరీ ని చేజిక్కించుకుని దందా నడిపించినట్టుగా ఆరోపణలున్నాయి. ఇప్పుడు సీఐడీ దర్యాప్తులో ఈ సంగతులన్నీ బయటకు వచ్చాయి. ఇక ఒక్కొక్కరినీ విచారణకు పిలిచి, వారి ద్వారా మొత్తం జగన్ మార్కు లిక్కర్ బాగోతం భరతం పట్టాల్సి ఉంది. విచారణల, నోటీసుల పర్వం బహుశా రాజ్ కసిరెడ్డితోనే ప్రారంభం కావచ్చునని పలువురు అంచనా వేస్తున్నారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి విచారణకు హాజరుకావాల్సిన రోజులు ఎంతో దూరంలో లేవని కూడా ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.