రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన హస్తినకు వెళ్లిన ప్రధాన లక్ష్యం- కేంద్రం తమ బడ్జెట్లో ప్రకటించిన ఏఐ ఎక్సెలెన్స్ సెంటర్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ప్రత్యేకించి విశాఖకు మంజూరు చేయించుకోవడం! ఆ పని మీద వెళ్లిన నారా లోకేష్ తొలిరోజు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిశారు. విశాఖపట్నం ఐటి కేంద్రంగా ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నదో వివరంగా తెలియజేశారు. విశాఖపట్నంకు ఏఐ ఎక్స్లెలెంట్ సెంటర్ ను కేటాయించడం వలన ఏ రకంగా బహుముఖ ప్రయోజనాలు ఉంటాయో కూడా తెలియజేశారు. విశాఖలో ఏర్పాటు చేయబోతున్న డేటాసిటీకి సహకరించాలని కూడా అడిగారు. మొత్తానికి కేంద్రమంత్రి విశాఖ, తిరుపతి నగరాల్లో పర్యటించి నిర్ణయం తీసుకునేలాగా ఆయనను ఒప్పించారు.
అయితే రెండో రోజు కూడా ఢిల్లీ పర్యటనలోనే ఉన్న నారా లోకేష్ పలువురు కేంద్రం పెద్దలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే- ఎవరిని మర్యాదపూర్వకంగా కలిసినా సరే ఆయన మనసులో మెదులుతూ ఉండే అజెండా మాత్రం ఒకే ఒక్కటి! ‘వారి ద్వారా రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలను తీసుకురావచ్చు’ అనేది మాత్రమే. ఆ విషయాన్ని ఆయన డిఫెన్స్ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో భేటీ అయినప్పుడు కూడా నిరూపించుకున్నారు.
నిజానికి రాజ్ నాథ్ తో భేటీ అనేది కేవలం మర్యాదపూర్వకమైన జరిగిన భేటీ. అయితే ఆయనతో మాట్లాడుతూ ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని, అలాగే రాష్ట్ర యువతరానికి ఉపాధి అవకాశాలు దక్కేలాగా రక్షణ రంగ పరికరాల తయారీ యూనిట్లు ఆంధ్రప్రదేశ్ కు వచ్చేలాగా చూడాలని డిఫెన్స్ మంత్రిని లోకేష్ అభ్యర్థించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అభివృద్ధి పట్టాలు ఎక్కిస్తున్నదని అప్పుల్లో మునిగిన ఏపీకి కేంద్రం ఆక్సిజన్ తరహాలో సహాయం అందిస్తున్నదని ఆయనకు వివరించారు.
డిఫెన్స్ మంత్రిని కలిసినది కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే అయినప్పుడు- సాధారణంగా ఎవరైనా సరే రాష్ట్రంలో జరుగుతున్న పురోగతి పనులను మాత్రం ఏకరవు పెట్టి తిరిగి వస్తారు. కానీ లోకేష్ అంతటితో ఊరుకోవడం లేదు. చివరికి డిఫెన్స్ ద్వారా కూడా రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనాలు తీసుకురావచ్చు అనేదే ఆలోచిస్తున్నారు. డిఫెన్స్ మంత్రి ఎదుట అలాంటి విజ్ఞప్తి పెడుతున్నారు. ఇది యువ నాయకుడిలో కనిపిస్తున్న చిత్తశుద్ధి అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎంతో అంకితభావం, పట్టుదల, కార్యదీక్ష ఉంటే తప్ప ఇలాంటి నిరంతరాయ కృషి సాధ్యం కాదని విశ్లేషకులు చెబుతున్నారు .
ఇటీవల కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి విశాఖ ఉక్కు పరిశ్రమను సందర్శించిన సందర్భంలో కూడా ప్రైవేటీకరణను ఆపడానికి, ఉక్కు పరిశ్రమను గాడిలో పెట్టేందుకు కేంద్రం నుంచి ప్యాకేజీ విడుదల చేయించడానికి నారా లోకేష్ చాలా శ్రమ తీసుకున్నట్లుగా ప్రశంసించిన వైనం మనకు గుర్తుండే ఉంటుంది. లోకేష్ అనేక పర్యాయాలు తనను కలిసి విశాఖ ఉక్కు పరిశ్రమకు తన తండ్రి హామీ ఇచ్చారని, దాని నిలబెట్టుకోవడానికి సహకరించాలని కోరినట్లుగా కుమారస్వామి కొనియాడారు.
ఈ దృష్టాంతాలు అన్నింటినీ కలిపి బేరీజు వేసుకున్నప్పుడు లోకేష్ ఏ మంత్రిని కలిసినా సరే రాష్ట్ర ప్రయోజనాలను లక్ష్యిస్తూ తన వంతు పాటు పడుతున్నట్లుగా, శక్తికి మించి ఆరాటపడుతున్నట్లుగా ప్రజలు నమ్ముతున్నారు!