ఎవ్వరేం చెప్పినా.. ‘ఒకటి’ కలిపేద్దాం!

Sunday, December 8, 2024

ప్రభుత్వం డబ్బును ప్రజలకు పంచేసి.. ఓట్లు దండుకునే ఆలోచనతోనే రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తున్నాయా? అనే అభిప్రాయం కలుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించిన మేనిఫెస్టోను గమనిస్తే అదే అనిపిస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం వృద్ధులకు మూడువేల పెన్షను ఇస్తుండగా.. కాంగ్రెస్ తాము వస్తే నాలుగువేలు చేస్తాం అని ప్రకటించింది. అయితే ఇది ఓటర్ల మీద ప్రభావం చూపిస్తుందని పసిగట్టిన కేసీఆర్ పాట పెంచడం ఒక్కటే దానికి విరుగుడు అని నిర్ణయించుకున్నట్టుగా ఉంది. వాళ్లు నాలుగువేలు అంటే.. నేను అయిదువేలు చేస్తా.. అనే హామీని ఆయన మేనిఫెస్టోలో పెట్టేశారు.

తెలంగాణ రాష్ట్రం నిజానికి ఎంతో ఆర్థిక వనరులతో, నిండుగా పొంగిపొరలే సంపదల ఖజానాతో తులతూగుతూ ఉండాల్సిన రాష్ట్రం. ఏపీ విభజన జరిగినప్పుడు.. ఆర్థికంగా ఎంతో గొప్ప వనరులు ఉన్న పరిఫుష్టమైన రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. ఎలాంటి ప్రజాకర్షక పథకాలను అమలు చేస్తున్నారనేది పక్కన పెడితే.. కేసీఆర్.. తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పటికే దారుణంగా అప్పుల్లో ముంచేశారనే అపప్రధను మూటగట్టుకున్నారు. ఇన్ని వనరులు, ఆదాయ మార్గాలు ఉన్న రాష్ట్రం అనూహ్యంగా అప్పుల ఊబిలో ఉంది. అలాంటిది.. ఇప్పుడు ఇంకా ముందు వెనుకలు చూసుకోకుండా.. కేవలం ఓట్లు దండుకోవడానికి ప్రత్యర్థుల హామీల కంటె ‘ఒక వెయ్యి’ పెంచి ప్రకటించేయడం ఒక్కటే మార్గం అని ఈ సరికొత్త ‘దేశ్ కీ నేతా’ కోరుకోవడం చిత్రంగా కనిపిస్తోంది.

ఇలాంటి పోకడే 2019 ఎన్నికల సమయంలో ఏపీలో కూడా కనిపించింది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో వృద్ధుల పెన్షన్ లను 2000 చేస్తానని ప్రకటించారు. అయితే.. చాలాకాలం నుంచి వాటిని రెండు వేలు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వంలో కసరత్తు జరుగుతోందని, ఆ సంగతి తెలుసుకునే జగన్ హామీ ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ.. చంద్రబాబు తాను కసరత్తు చేసిన నిర్ణయాన్ని తానే అమల్లోకి తెచ్చేశారు. వెంటనే జగన్ ఆ పాట పెంచారు. నేను హామీ ఇచ్చేసరికి చంద్రబాబు భయపడి పెన్షను 2000 చేశారు. అలాగైతే నేను మూడు వేలు చేస్తా అని చెప్పారు. గెలిచిన తర్వాత.. ఏడాదికి 250 వంతున పెంచుతూ పోతున్నారు.

కేసీఆర్ కూడా జగన్ బాటనే అనుసరించారు. వాళ్లిచ్చేదేమిటి.. నేను ఇంకా ఎక్కువ ఇస్తా.. అనేదే ఆ బాట. ఇలాంటి పోకడలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను ఛిన్నాభిన్నం చేస్తాయనే భయం పలువురిలో కలుగుతోంది. పార్టీలు ఇలా పోటీ పడి.. పెంచుకుంటూ పోతే.. వారికి ఓట్లు రావొచ్చు గానీ.. రాష్ట్ర పరిస్థితులు మాత్రం దెబ్బతింటాయనేది పలువురిలో భయంగా ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles