ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికాసం కోసం నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబునాయుడు ఒక మంచి పనిచేస్తున్నారంటే చాలు.. ప్రజల బాగుకోసం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం ఒక నిర్దిష్టమైన మంచి ఆలోచన చేస్తున్నారంటే చాలు… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు గుండెల్లో భయం మొదలవుతుంది. అంతే వారి తరఫు మేధావులందరూ తమ కుట్రలను, పన్నాగాలను బయటకు తీస్తారు. తాము మాత్రం భయపడితే చాలదు.. రాష్ట్ర ప్రజలందరినీ కూడా భయపెట్టి తీరాలని రకరకాల అబద్ధాలు, అవాకులు చెవాకులతో చెలరేగిపోతారు.అయితే ఇందులో ట్విస్టు ఏంటంటే.. వారి గుండెల్లో పుట్టేది ఒక రకం భయం అయితే.. వారు ప్రజల్లోకి వ్యాప్తి చేయాలని తలపోసేది మరొక రకం భయం!
ఫరెగ్జాంపుల్ చంద్రబాబునాయుడు పీ4 అనే సరికొత్త విధానానికి రూపకల్పన చేశారు.
ప్రభుత్వానికి ఏమాత్రం భారం పడని వ్యవహారం ఇది. వదాన్యశీలులైన సంపన్నులు, దాతలు, పారిశ్రామికవేత్తలు ఇందుకు అవసరమైన నిధులు సమకూరుస్తారు. వారివారికి ఆసక్తి గల నియోజకవర్గాల పరిధిలో ఏ పేద కుటుంబాలను ఆదుకుంటే బాగుంటుందో ప్రభుత్వం కొన్ని సిఫారసులు చేస్తుంది. ఆ పేద కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, ఎదగడానికి ఈ పీ4 విధానం తోడ్పడుతుంది. ఈ విధానం ద్వారా లబ్ధి పొందే వారికి బంగారు కుటుంబాలు అని పేరు పెట్టారు చంద్రబాబునాయుడు. అలాగే వితరణ శీలతతో ముందుకొచ్చే వారికి మార్గదర్శులు అని పేరు పెట్టారు.
ఈ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గంలో కనీసం పదిహేను వేల కుటుంబాలకు ఆర్థిక సాయం అందుతుందని చంద్రబాబునాయుడు చెబుతున్నారు. అదే జరిగితే.. అన్ని జీవితాలు బాగుపడితే.. ఆ పదిహేను వేల కుటుంబాలు తెలుగుదేశం పార్టీకి స్థిరమైన ఓటు బ్యాంకుగా మారడం మాత్రమే కాదు, ఆ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్లుగా కూడా మారుతారు కదా.. అనేది వైసీపీ భయం. ఈ కార్యక్రమం సక్సెస్ ఫుల్ గా నడిస్తే.. ఇక జీవితంలో తాము ఎప్పటికీ అధికారంలోకి మళ్లీ రాలేం అనేది వారి ఆందోళన
అయితే వారు ప్రజలను మరో రకంగా భయపెట్టాలని చూస్తున్నారు. బంగారు కుటుంబాలుగా నమోదు అయి.. పీ4 ద్వారా లబ్ధి పొందుతున్న వారికి ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలు ఆగిపోతాయి .. అని ప్రచారం చేస్తున్నారు. ఆ రకంగా ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారు. అయితే చంద్రబాబునాయుడు వారి కుట్రలకు విరుగుడుగా.. బంగారు కుటుంబాలకు చాలా స్పష్టంగా భరోసా కల్పిస్తున్నారు. పీ4 బంగారు కుటుంబాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆగవు అని ఆయన వెల్లడిస్తున్నారు. అవి ఎప్పటిలాగానే కొనసాగుతాయని అంటున్నారు. ఇది పేదలకు చంద్రబాబునాయుడు ప్రకటించగల అతిగొప్ప వరం అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.
