చంద్రబాబునాయుడు దార్శనికత ఎలా ఉంటుందో.. వర్తమాన ప్రపంచానికంటె ఆయన ఎంతకాలం ముందుగా ఆలోచిస్తూ అందుకు తగిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారో.. అమరావతి విషయంలో అడుగడుగునూ బయటపడుతూనే ఉంది. ప్రత్యేకించి అవుటర్ రింగ్ రోడ్డు విషయంలో కేంద్రప్రభుత్వం కేవలం 70 మీటర్ల వెడల్పుతో నిర్మాణం చేయడానికి ఆమోదం తెలియజేయగా.. చంద్రబాబునాయుడు మరో యాభయ్యేళ్త తర్వాత.. అమరావతి నగరానికి పెరగనున్న ప్రాధాన్యం అప్పటి రవాణా అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఇప్పుడే నిర్మించాలని పట్టుబట్టి మరీ 140 మీటర్ల వెడల్పుతో చేయడానికి వారిని ఒప్పించిన సంగతి అందరికీ తెలుసు. అదే విధంగా అమరావతి నగర విస్తరణకు కూడా ఎంతో ముందుచూపుతో బాబు సర్కారు నిర్ణయాలు తీసుకుంటున్నది. ఆ క్రమంలో తెలుగురాష్ట్రాల్లో మరెక్కడా లేనివిధంగా.. దేశంలోనే అత్యంత అరుదుగా కనిపించే అద్భుతమైన హంగులు అమరావతికి సమకూరనున్నాయి.
శనివారం నాడు మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఉండవిల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఆర్డీయే సమావేశం జరిగింది. అమరావతి రాజధాని పనులకు సంబంధించిన అనేక కీలక నిర్ణయాలు ఈ భేటీలో తీసుకున్నారు. సమావేశం తర్వాత మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. రాజధాని విస్తరణ కోసం మొత్తం ఏడు గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ చేయబోతున్నట్టుగా ఆయన చెప్పారు. అలాగే పదివేలమంది కూర్చునేలా కన్వెన్షన్లను నిర్మించడానికి సంస్థలు ముందుకు వస్తే రెండున్నర ఎకరాల జాగా ఇస్తాం అని కూడా ప్రకటించారు. నిజానికి పదివేల మంది సీటింగ్ కెపాసిటీతో కన్వెన్షన్ అంటే.. చాలా పెద్దదనే చెప్పాలి. హైదరాబాదు హైటెక్స్ లో కూడా అలాంటివి లేవనే అనుకోవాలి. పదివేలమందికి సీటింగ్ కెపాసిటీ అంటే దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్లలో అవి ఒకటిగా నిలుస్తాయి. ఇలాంటి కొత్త అమరావతికి వన్నె తీసుకువచ్చే అద్భుతమైన హంగులుగా నిలుస్తాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
కొత్త భూసమీకరణ ద్వారా అందుబాటులోకి రానున్న స్థలాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం, దేశంలోనే ఎక్కడా లేనటువంటి పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే సంకల్పించిన సంగతి అందరికీ తెలుసు. అలాగే.. ఆ ప్రాంతంలోనే రెండున్నర వేల ఎకరాల్లో స్మార్ట్ పరిశ్రమలను నెలకొల్పడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు నారాయణ వెల్లడిస్తున్నారు. ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయ నిర్మాణానికి కూడా రెండు ఎకరాలు కేటాయించడానికి సీఆర్డీయే ఆమోదం తెలియజేసింది. అలాగే భూముల కేటాయింపునకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలకు ఆమోదం తెలియజేశారు. మొత్తానికి అమరావతి నగర నిర్మాణ పనులు జరుగుతున్నంత జోరుగానే.. విస్తరణ రూపేణా కొత్త అమరావతికి సంబంధించిన కసరత్తు కూడా జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది.