ఎన్డీయే కూటమి దృఢంగా ఉన్నంతకాలం.. ఈ రాష్ట్రంలో తాము అధికారంలోకి రాలేం అనే వాస్తవం వైఎస్సార్ కాంగ్రెస్ వారికి బాగానే బోధపడింది. ఇప్పుడు వారి ఫోకస్ మొత్తం కూడా కూటమిలో చిచ్చు పెట్టడం మీదనే ప్రధానంగా సాగుతోంది. పవన్ కల్యాణ్ ను రెచ్చగొట్టి.. ఆయన అవమానాలు పడుతున్నట్టుగా చిత్రించి.. పార్టీ కార్యకర్తలంతా రెచ్చిపోయేలా చేసి.. తమ పబ్బం గడుపుకోవాలని వారు చూస్తున్నారు. కానీ వారి పాచికలు పారడం లేదు. జనసేన నాయకులు గానీ, భాజపా నాయకులు గానీ.. ఏమాత్రం రెచ్చిపోవడం లేదు. తెలుగుదేశం కూటమిలో అతిపెద్ద పార్టీగా ఎటూ సరైన ప్రాధాన్యంతోనే ఉన్నది గనుక.. వారివైపు నుంచి ఇబ్బంది లేదు. మొత్తానికి కూటమి ఐక్యంగా ఉండడానికి పవన్ కల్యాణ్ లోని సంయమనం శ్రీరామరక్షలాగా పనిచేస్తున్నదనే విశ్లేషకులు భావిస్తున్నారు.
పవన్ కల్యాణ్ చాలా సున్నితమైన, త్వరగా భావోద్వేగాలకు గురయ్యే మనిషి. అలాంటి నాయకుడిని రెచ్చగొట్టడం చాలా సులువు అనేది వైసీపీ వారి వ్యూహం. కూటమి ప్రభుత్వంలో ఆయనకు అన్యాయం జరుగుతున్నట్టుగా, ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నట్టుగా మాట్లాడుతూ పుండు పెట్టడానికి వారు ప్రయత్నిస్తున్నారు. తాజాగా అంబటి రాంబాబు కూడా మట్లాడుతూ.. డిప్యూటీ సీఎంగా హెలికాప్టర్ లో సీటు, ప్రత్యేక విమానం తప్ప పవన్ కల్యాణ్ మరేమైనా అనుభవిస్తున్నారా? అంటూ ఎద్దేవా చేయడం వారి దుర్బుద్ధికి పరాకాష్ట. జగన్ సర్కారులో డిప్యూటీ ముఖ్యమంత్రులను పురుగుల కంటె హీనంగా చూశారనే సంగతి అందరికీ తెలుసు. నారాయణ స్వామి లాంటి వాళ్లు తన సొంత నియోజకవర్గంలో కూడా తనకు విలువలేదని బహిరంగ వేదికలపై కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటి అంబటి పవన్ ను రెచ్చగొట్టాలనిచూస్తున్నా ఆయన రెచ్చిపోవడం లేదు.
మార్కాపురం కార్యక్రమంలో పవన్ మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనం. ‘కూటమి ప్రభుత్వంలో ఒకరికొకరు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని పవన్ తమ నాయకులకు హితవు చెప్పారు. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కవు కాదన్నారు. కుటుంబంలో తల్లిదండ్రులు తిట్టుకుంటూ లేస్తే పిల్లలు కొట్టుకుంటూ లేస్తారని అంటూ.. గ్రామస్థాయిలో కార్యకర్తల మధ్య చిన్న చికాకులున్నా ఐక్యంగా ముందుకు వెళ్లాలని ఆయన హితవు చెప్పారు’ ఈ స్థాయిలో ఆయన సంయమనం ప్రదర్శించడం చాలా గొప్ప విషయం. గత పాలకులు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసినా పట్టించుకోవద్దని.. కూటమి ఐక్యత తద్వారా రాష్ట్ర అభివృద్ధి మాత్రమే మన లక్ష్యాలుగా ఉండాలని పవన్ చెప్పడం శుభపరిణామం అని విశ్లేషకులు భావిస్తున్నారు.
