‘అమ్మకు అన్నం పెట్టని వాడు.. పిన్నమ్మకు పరమాన్నం పెడతానన్నాడట’ అనే పామెత తెలుగునాట చాలా పాపులర్ అయింది. రాజకీయాల్లో ప్రధానంగా నాయకులు దీనిని, తమ ప్రత్యర్థులను విమర్శించడానికి తరచుగా వాడుతూ ఉంటారు. ఈ సామెతకు ఇంతటి ఆదరణ తీసుకువచ్చిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డే. చంద్రబాబును ఆయన ఇలా నిందిస్తూ ఉండేవారు. అదంతా పక్కన పెడదాం. ఇప్పుడు విషయానికి వస్తే.. ఈ సామెత.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహార సరళికి అచ్చు గుద్దినట్టుగా సరిపోతుందని పలువురు విశ్లేషిస్తున్నారు. పార్టీకి నాయకులతోపాటు, కార్యకర్తలు కూడా దూరమౌతుండగా.. వారిని కాపాడుకోవడం కోసం జగన్ పడుతున్న నానా పాట్లలో భాగంగా.. ఇలాంటి సామెతతో పోల్చదగిన ప్రమాణాలు చేస్తున్నారని అంటున్నారు. జగన్ 2.0 ప్రభుత్వం ఏర్పడితే..
కార్యకర్తలను దేవుళ్లలాగా చూసుకుంటానని, కార్యకర్తల మాటే తన పాలనలో వేదంలాగా సాగుతుందని.. కార్యకర్తల అభివృద్ధి కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటానని జగన్ దాదాపుగా ప్రతి సమావేశంలోనూ చెబుతూనే వస్తున్నారు. అయితే.. ఇదంతా ఆ సామెత చందమేనని.. అధికారంలో ఉన్నప్పుడు.. కార్యకర్తల బాగుకోసం ఎంగిలిచేతిని కూడా విదిలించని వాడు.. అధికారం పోయిన తర్వాత చెబుతున్న మభ్యపెట్టే మాటలు మాత్రమేనని ఆ పార్టీ వారే అంటున్నారు. మళ్లీ అధికారంలోకి వస్తే చేస్తానని చెప్పడం కాదు.. ఇప్పుడు పార్టీ అధినాయకుడిగా కార్యకర్తల కోసం ఏం చేస్తారో చెప్పాలని అడుగుతున్నారు.
తెలుగుదేశం పార్టీలో గానీ, జనసేనలో గానీ.. క్రియాశీల కార్యకర్తలకు బీమా సదుపాయం ఉంది.
ప్రమాదవశాత్తూ మరణిస్తే వారికి బీమా మొత్తం చెల్లించే ఏర్పాటు ఉంది. వైసీపీలో అలాంటి సదుపాయం లేదు. ఇది పార్టీకి ఎంత సిగ్గుచేటు వ్యవహారం అంటే.. కరడుగట్టిన వైసీపీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు కూడా.. కేవలం ఈ బీమా సదుపాయం కోసం తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డు తీసుకుంటున్నారు. మొన్నటికి మొన్న రెంట పాళ్ల యాత్రలో రప్పారప్పా ఫ్లెక్సి పట్టుకుని అరెస్టు అయిన వ్యక్త కూడా ఇలాంటి వాడే.
పార్టీ పరంగా కార్యకర్తల కనీస బాగుకోసం జగన్మోహన్ రెడ్డి నామమాత్రపు శ్రద్ధ కూడా చూపించరు గానీ.. మళ్లీ అధికారంలోకి వస్తే.. మీకు అంతా దోచిపెట్టేస్తా అని అనడం కేవలం వంచన తప్ప మరొకటి కాదని అందరూ వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీకి అనేకమంది నాయకులు ఇప్పటికే దూరం అయ్యారు. కార్యకర్తలు కూడా పట్టించుకోవడం లేదు. ఇలాంటి మాటలు చెప్పడం ద్వారా.. కార్యకర్తల్ని కాపాడుకోవాలని వంకరప్రయత్నాలు పార్టీ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.