జగన్ పరుసవేది: ముడుపుల్లో ధగధగలే!

Friday, December 5, 2025

పాలోకొయిలో అనే ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఒక రచయిత ప్రపంచంలోనే అత్యంత బెస్ట్ సెల్లర్స్ అయిన పుస్తకాలలో ఒకదానిని రాశారు. తెలుగులో ఆ పుస్తకం పేరు ‘పరుసవేది’! పరుసవేది అంటే బంగారాన్ని తయారుచేసే విద్య! ఆ నవలలోని కథాంశం ఏంటంటే.. గొర్రెలను మేపుకుని, వాటి ఉన్నిని గొరిగి విక్రయించడంద్వారా ఉదరపోషణ చేసుకునే ఒక కుర్రవాడు.. బంగారాన్ని తయారుచేసే విద్య నేర్చుకోవాలని, తద్వారా సంపన్నుడు కావాలని కలలు కంటాడు. అందుకోసం అనేక సాహసాలు చేస్తాడు. తన గొర్రెలన్నిటినీ కూడా అమ్మేస్తాడు. అష్టకష్టాలు పడతాడు. కానీ.. ఇక్కడ మతలబు ఏంటంటే.. ఆ పేద గొర్రెల కాపరి కుర్రవాడు.. అన్ని కష్టాలు పడే అవసరమే లేదు.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సంప్రదించి ఉంటే అతడికా విద్య చిటికెలో అబ్బి ఉండేది. కనీసం జగన్ లిక్కర్ మాఫియా నెట్ వర్క్ లో తానుకూడా ఒకడుగా ఉండి ఉంటే తృణమో పణమో బంగారమే దక్కి ఉండేది. ఎందుకంటే.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాలనకాలంలో.. తాను నేర్చిన పరుసవేది విద్యను ప్రదర్శించారు. ఆయన తనకోసం తీసుకున్న ముడుపులను కూడా బంగారం రూపంలో స్వీకరించారు. మొత్తం మూడున్నర వేల కోట్లకుపైగా ముడుపులు కాజేసిన లిక్కర్ స్కామ్ లో 400 కోట్ల వరకు మద్యం కంపెనీలు, డిస్టిలరీల నుంచి బంగారం రూపంలో గుట్టుచప్పుడు కాకుండా ముడుపులు తీసుకున్నారంటే.. బంగారం తయారీ విద్య తెలిసినట్టే కదా అని ప్రజలు అనుకుంటున్నారు.

కొత్త మద్యం పాలసీ తీసుకురావడంలోనే జగన్మోహన్ రెడ్డి అతిపెద్ద దోపిడీపర్వానికి తెరతీసారు. కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి సారథ్యంలో వసూళ్లకు ఒక అతిపెద్ద నెట్ వర్క్ నడిచింది. ప్రతి డిస్టిలరీ నుంచి ప్రతిరూపాయినీ కేవలం క్యాష్ రూపంలో మాత్రమే తీసుకోకుండా.. చాలా వరకు బంగారం రూపంలో కూడా తీసుకోవడం అనేది వసూళ్ల వెనుక మాస్టర్ బ్రెయిన్ ల యొక్క మాస్టర్ ప్లాన్ అన్నమాట.
అయితే ఇంతటి చాకచక్యపు అవనీతి దోపిడీ.. పోలీసుల ఊహకు కూడా అందనిది. ఈ దోపిడీ పర్వం వారికి ఊహకందని విధంగానే వెలుగులోకి వచ్చింది.

ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా చేసిన వాసుదేవరెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత.. ఆఫీసునుంచి ఫైళ్లను మాయం చేశారంటూ ఆరోపణలు వచ్చాయి. ఆ సందర్భంలో ఆయన మీద తనిఖీలు నిర్వహించినప్పుడు.. ఒక బంగారం కొనుగోలు రసీదు దొరికింది. గ్రాముల్లో కాకుండా కిలోల్లో కొన్నట్టుగా ఉన్న రసీదు అది. చిత్రంగా ఉన్నదని పోలీసులు డిస్టిలరీల లావాదేవీలను బ్యాంకు స్టేట్మెంట్ల ఆధారంగా పరిశీలించారు. దాదాపు 400 కోట్ల రూపాయల విలువైన బంగారాన్ని డిస్టిలరీలు కొన్ని మద్యం కుంభకోణంలో వసూళ్ల నెట్ వర్క్ కు అందజేసినట్టు తేలింది. వసూలైన డబ్బుతో ముఠా సభ్యులు కూడా బంగారమే కొన్నట్టుగా తేల్చారు.

మద్యం కేసులో రాష్ట్రప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టులో కేసు వాదించిన న్యాయవాది ఈ విషయం ప్రస్తావించారు. అయితే.. ఓ అధికారి చెబుతున్నదాన్ని బట్టి.. పూర్తిస్థాయిలో విచారణ చేస్తే.. కేవలం బంగారం కొనుగోళ్ల ద్వారా చేతులుమారిన ముడుపులే వెయ్యి కోట్ల దాకా ఉండవచ్చునని అనుకుంటున్నారు.

పైగా జగన్ సర్కారులోని పెద్దలు లిక్కర్ వాటాల ద్వారా సేకరించిన బంగారం విలువ ఇప్పటికి కనీసం మూడు రెట్లు పెరిగి ఉంటుంది కూడా. అందుకే జగన్మోహన్ రెడ్డిని పరుసవేది విద్య తెలిసిన నాయకుడు అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles