సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మరో యువ హీరో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టేందుకు రెడీ అయ్యాడు. కృష్ణ పెద్ద కుమారుడు రమేష్‌బాబు కొడుకు జయకృష్ణ ప్రస్తుతం హీరోగా సినీ రంగ ప్రవేశం చేయబోతున్నాడు. ఇటీవల జయకృష్ణ ఫోటోషూట్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో ఆయన ఎంట్రీపై ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ఆ ఫోటోలు బయటకు వచ్చినప్పటి నుంచే వివిధ ఊహాగానాలు వినిపించాయి.
ఇప్పుడు వాటన్నింటికీ ముగింపు పలుకుతూ, జయకృష్ణ తొలి సినిమా గురించి స్పష్టత వచ్చేసింది. ఈ ప్రాజెక్ట్‌కి డైరెక్షన్ బాధ్యతలు అజయ్ భూపతి తీసుకుంటున్నారు. గతంలో ఆర్ఎక్స్ 100, మంగళవారం లాంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇప్పుడు జయకృష్ణను హీరోగా పరిచయం చేయబోతున్నారు. ఈ సినిమా నిర్మాణంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు అయిన వైజయంతీ మూవీస్, ఆనంది ఆర్ట్స్ కలిసి పనిచేయబోతున్నాయి.
ఈ కాంబినేషన్ చూస్తేనే ప్రాజెక్ట్ పట్ల అంచనాలు భారీగా పెరిగిపోయాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడే అవకాశముంది. మరోవైపు అజయ్ భూపతి ప్రస్తుతం మంగళవారం 2 సినిమాతో కూడా బిజీగా ఉన్నాడు. అయినా కూడా ఆయన జయకృష్ణ ఎంట్రీ సినిమా కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించినట్టు సమాచారం.
ఇక జయకృష్ణకు ఇది ఓ పెద్ద అవకాశం అనే చెప్పాలి. ఎందుకంటే ఆయనకు సినీ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ, మెగా బ్యానర్స్, మంచి దర్శకుడితో కలిసి ఈ ప్రాజెక్ట్ మొదలవుతుండటంతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కే ఛాన్స్ ఉంది.
