అమరావతి రాజధాని ప్రియులకు ఇది శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రజల స్వప్నంగా ప్రపంచస్థాయి నగరంగా రూపొందుతున్న అమరావతి నిర్మాణం ఒక కొలిక్కి వచ్చేలోగా.. అన్ని రకాల రవాణా అనుసంధానం కూడా అనువుగా అందుబాటులోకి రానుంది. అమరావతి ప్రాంతంతో ఇప్పటికే రోడ్ అనుసంధానం సవ్యంగా ఉంది.
నగర నిర్మాణ పనులు ఊపందుకుంటున్న ప్రస్తుత తరుణంలో నేషనల్ హైవేలను కూడా అనుసంధానించరే ప్రణాళికలు చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు కాగా.. రైల్వే పరంగా కూడా అమరావతి నగరాన్ని ఇతర నగరాలతో అనుసంధానించే రైల్వే పనులకు కూడా శ్రీకారం జరిగింది. నగర నిర్మాణం ఒక కొలిక్కి వచ్చేలోగా.. అమరావతి కోసం కొత్తగా వేస్తున్న రైల్వే లైన్లు కూడా అందుబాటులోకి వచ్చేస్తాయని రైల్వే అధికారులు చెబుతున్నారు.
అమరావతిని ఇతర ప్రాంతాలతో అనుసంధానించేందుకు ఎర్రుపాలెం- నంబూరు మధ్య కొత్త రైల్వే లైను నిర్మాణాలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి ట్రాక్ నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. ఈ రైల్వేలైన్ల నిర్మాణం రాబోయే నాలుగేళ్లలో పూర్తవుతుందని విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ ప్రకటిస్తున్నారు. నాలుగేళ్లలో రైల్వేలైను పూర్తికావడం ఎంతో శుభపరిణామం. ఎందుకంటే.. ఈలోగా నగర నిర్మాణం కూడా చాలా వరకు పూర్తవుతుంది. కీలక భవనాలు, కార్యకలాపాలు అప్పటికి ఒక కొలిక్కి వస్తాయి. రైల్వేలైను కూడా అప్పటికి రెడీ కావడం ఎంతో మంచి పరిణామం అని ప్రజలు భావిస్తున్నారు.
నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి నుంచి ఇరుగు పొరుగు రాష్ట్రాల రాజధాని నగరాలకు బుల్లెట్ రైళ్లు నడిపే ఆలోచనను కూడా ఇటీవల ప్రకటించారు. ఈ అయిదేళ్లలోగా బుల్లెట్ రైళ్లు కూడా నడిచేలా పార్లమెంటులో తమ ఎంపీలు ప్రయత్నించాలని ఆయన దిశానిర్దేశం చేశారు. అమరావతి నుంచి ఇటు హైదరాబాదు, అటు చెన్నై, బెంగుళూరు నగరాలకు బుల్లెట్ రైళ్లు నడపాలని కూడా ఆయన అంటున్నారు.
బుల్లెట్ రైళ్లు నడిచే సంగతి కొంచెం అటు ఇటు కావొచ్చు గానీ.. అమరావతి రైల్వే లైను తప్పకుండా పూర్తవుతుందనేది ప్రజల నమ్మకం. ఎందుకంటే.. ఈ కొత్త రైల్వేలైను ట్రాక్ ల నిర్మాణానికి గత ఏడాది అక్టోబరులోనే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.2545 కోట్లను ఆ పనులకు కేటాయించింది. నిదుల కొరత, కొత్తగా నిధుల కోసం ప్రయత్నించాల్సిన అవసరం కూడా లేకపోవడం వలన.. అమరావతి రైల్వే లైను తప్పకుండా పూర్తవుతుందని.. రాజధాని పనులకు సమాంతరంగా రైల్వే పనులు కూడా జరగడం ఆశాజనక పరిణామం అని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
