రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు తీసుకురావడం అనేది పెద్ద నేరంగా పరిగణించవలసిన అవసరం లేదు. ఎందుకంటే చాలా సందర్భాలలో రాష్ట్రాల ఆదాయానికి- ప్రభుత్వాలు తలపెట్టే సంక్షేమ పథకాలు, పరిపాలన వ్యయం తదితర ఖర్చులకు పొంతన ఉండదు. ఇలాంటి సందర్భాలలో కచ్చితంగా అప్పులు తీసుకురావాల్సిన అగత్యం రాష్ట్ర ప్రభుత్వాలకు ఏర్పడుతుంది. ప్రభుత్వం అప్పు చేయడాన్ని ప్రజలు కూడా నేరంగా పరిగణించే పరిస్థితి లేదు. అయితే సంపద సృష్టి పరంగా కనీసం ఒక్క రూపాయి సృష్టించే విధమైన అడుగు కూడా ముందుకు వేయకుండా.. ఏకపక్షంగా లక్షల కోట్ల రూపాయల అప్పులు చేస్తూ.. వాటికి సంక్షేమ పథకాల ముసుగు తొడిగి, స్వాహా పర్వం నడిపించడం … ప్రజలు జీర్ణం చేసుకోలేని సంగతి. వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కాలంలో జరిగింది అదే.
కేవలం ఐదేళ్ల పదవీకాలంలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకువచ్చారు జగన్మోహన్ రెడ్డి. వాటన్నింటినీ దాదాపుగా సంక్షేమ పథకాల ముసుగులోనే కర్చు పెట్టారు. ప్రభుత్వానికి ఏవైతే ఆదాయ మార్గాలు ఉంటాయో వాటిలో స్వాహా పర్వాన్ని నడిపించారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కనిపించదు.. పెట్టే ఖర్చు మొత్తం అప్పుల ద్వారా మాత్రమే జరుగుతూ ఉంటుంది… ఇలాంటి పరిస్థితుల్లో ఘోరమైన ఆర్థిక దురవస్థలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెట్టేశారు. అయితే నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరిగిన ఆర్థిక విధ్వంసానికి చంద్రబాబు నాయుడు ఇప్పుడు శస్త్ర చికిత్స చేస్తున్నారు. తాజాగా ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతో భేటీ అయి రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ఉదారంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీలో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా అసెంబ్లీ ఎన్నికలలో తెలుగువారి ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ప్రచారం నిర్వహించేందుకు చంద్రబాబు నాయుడు వెళ్లారు. ఈ సందర్భంగా కేంద్రంలోని పలువురు పెద్దలతో కూడా ఆయన భేటీ అయ్యారు. ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతో సమావేశం కూడా రెండు గంటల పాటు జరిగింది. ఏపీలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితి గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసక పరిణామాలను పనగడియా దృష్టికి చంద్రబాబు తీసుకువెళ్లారు. ఐదేళ్లలో వివిధ రంగాలలో ఏరకంగా నష్టం వాటిల్లిందో.. ఆయా రంగాలు ఎలా కుదేలైపోయాయో ఒక ప్రజెంటేషన్ ద్వారా పనగడియాకు ఆయన వివరించారు.
దక్షిణాది రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ కే తక్కువ జిడిపి ఉన్నదని, ఐదేళ్ల దుర్మార్గమైన పాలన కారణంగా చాలా వరకు నష్టపోయిందని, అప్పులు తిరిగి చెల్లించే స్థితిలో లేదని నీతి ఆయోగ్ కూడా చెప్పిన వైనం చంద్రబాబు గుర్తు చేశారు. జగన్ సర్కారు ఐదేళ్లలో తెచ్చిన 10 లక్షల కోట్ల అప్పులు మాత్రమే కాకుండా లక్షన్నర కోట్ల రూపాయల బిల్లులు కూడా పెండింగ్లో పెట్టారని చెబుతూ.. ఆర్థికంగా రాష్ట్రం గట్టెక్కడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అరవింద్ పనగడియా పరిస్థితిని అర్థం చేసుకుని సహకరిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక భవితవ్యానికి 16వ ఆర్థిక సంఘం ద్వారా ఒక భరోసా దక్కినట్లు అవుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.