ఆ విషయంలో జగన్ ను తప్పుపట్టిన తమ్ముడు!

Friday, March 14, 2025

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో తొలినుంచి బాగా దూకుడుగా వ్యవహరిస్తున్న వారిలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా ఒకరు. వైసీపీలోని అతివాద ఎమ్మెల్యేలుగా వెంకట్రామిరెడ్డికి మాత్రమే కాదు, ఆయన చిన్నాన్న, తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి కూడా పేరుంది. అలాంటి వెంకట్రామిరెడ్డి కూడా ఇప్పుడు ఒక విషయంలో తమ అధినేత జగన్మోహన్ రెడ్డి గతంలో అనుసరించిన వైఖరిని తప్పుపడుతున్నారు. ఆయన అలా చేసి ఉండాల్సింది కాదు అంటున్నారు. ఇంతకూ అంతటి కరడుగట్టిన ఎమ్మెల్యేలో కూడా.. జగన్ తప్పు చేశాడని అనిపించిన ఆ ఉదంతం ఏమిటి?
ఎన్నికల్లో దారుణమైన పరాజయం తర్వాత.. వైసీపీ నాయకుల్లో ఒక్కరొక్కరుగా తమ తప్పు తాము గుర్తిస్తున్నట్టుగా ఉంది. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ గతంలో జగన్ పాలనకాలంలో జరిగిన అనేక అరాచకాల గురించి ప్రస్తావించారు.

చంద్రబాబు భార్య భువనేశ్వరి గురించి అనుచితమైన రీతిలో, నీచమైన వ్యాఖ్యలు చేసిన వారి గురించి ప్రస్తావన వచ్చినప్పుడు.. ఆ వ్యాఖ్యల గురించి తనకు స్పష్టత లేదని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు. ఒకవేళ నిజంగా అలాంటి వ్యాఖ్యలుచేసిఉంటే.. అది తప్పు అని అధిష్ఠానం చెప్పి ఉంటే బాగుండేది అని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. అప్పట్లో వల్లభనేని వంశీ అనుచిత వ్యాఖ్యలు చేయగా.. వాటిని శాసనసభలోనే మళ్లీ మళ్లీ ప్రస్తావిస్తూ.. వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును ఏ రకంగా మానసికంగా క్షోభకు గురిచేశారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జగన్ మాత్రం.. ఆ నీచమైన వ్యాఖ్యలు వస్తోంటే తన వారిని వారించాల్సింది బదులుగా ముసిముసినవ్వులు నవ్వుతూ గడిపేశారనే విమర్శలున్నాయి. ఇప్పుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాటల్లో కూడా అదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇలాంటి వాటివల్ల.. చంద్రబాబును రాక్షసుల్లా హింసిస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లిపోయింది అంటూ  కేతిరెడ్డి చెప్పుకొచ్చారు. చంద్రబాబు అరెస్టు కూడా జనసేన తెలుగుదేశం ఏకం కావడానికి దారితీసిందన్నారు.
పైగా అప్పట్లో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి పూనుకోవడాన్ని కూడా కేతిరెడ్డి ఖండించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు వచ్చినాసరే.. దాడులకు పాల్పడడం మంచి పద్దతి కాదు అంటూ సుద్దులు చెప్పారు. తాడిపత్రిలో తన చిన్నాన్న అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. జేసీ ప్రభాకర రెడ్డి ఇంటిమీదకు దాడికి వెళ్లడాన్ని కూడా తప్పుపట్టారు.

తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడికి సంబంధించి.. జగన్ ను నానా మాటలు అంటే మా పార్టీ కార్యకర్తలు ఊరుకుంటారా? వారి రక్తం మరగదా? ఆవేశం కలగదా? అంటూ రకరకాల మాయమాటలు చెబుతూ సమర్థించుకున్న వైసీపీ పెద్దలకు బహుశా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాటలైనా కనువిప్పు కలిగిస్తాయేమో చూడాలి. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles