ఇంకా మాయల గురించి మాట్లాడితే. భవిష్యత్తూ ఉండదు!

Sunday, February 16, 2025

మాజీ మంత్రి అంబటి రాంబాబులో ఇంకా తన మాటల గారడీలతో అధినేతను మాయలో పెట్టే పనిలోనే ఉన్నారా? వాస్తవాల గురించి అధినేతకు తెలియకపోయినా సరే.. ఆయనకు అవగాహన కల్పించి పార్టీని తిరిగి గాడిలోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత అంబటి రాంబాబు వంటి సీనియర్ నాయకులమీద ఉంటుంది. కానీ వారు, పార్టీ పతనం అయిన తర్వాత కూడా.. తాన అంటే తందానా అనే బ్యాచ్ లాగా.. అధినేత ముఖప్రీతికోసం మాట్లాడుతూ.. పార్టీకి మరింత చేటు చేస్తున్నారనే అభిప్రాయాలు పార్టీ కార్యకర్తల్లో వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఎలా విజయం సాధించిందో.. ఏం మాయ జరిగిందో ఇంకా తమకు అనుమానాలున్నాయంటూ అంబటి మాట్లాడడం పార్టీ వారికే నచ్చడం లేదు. ఎంతకాలం ఇలా ఆత్మవంచన చేసుకుంటూ బతకాలి అని వారు ప్రశ్నిస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత దారుణమైన రీతిలో ప్రజల తిరస్కారానికి గురైనతర్వాత.. నష్టనివారణ చర్యలో కాదో తనకే అర్థం కాకుండా.. జగన్ అనేకానేక మార్పు చేర్పులు చేపడుతున్నారు. ఆ మార్పుల క్రమంలో భాగంగా అనకాపల్లి పార్లమెంటు ఇన్చార్జిని కూడా మార్చారు. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని జగన్ ఈ హోదాలో నియమించారు. ఆయన బాధ్యతలు స్వీకరించే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంబటి రాంబాబు హాజరయ్యారు.

ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మరోసారి జగన్మోహన్ర రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నామని, కానీఘోరంగా ఓటమి పాలయ్యామని.. ఓటమిని ఒప్పుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. ఈలోగా కొంత మాట మార్చారు. ఓటమిని ఒప్పుకుంటున్నట్టుగా తాను మాట్లాడిన సంగతి తెలిస్తే జగన్ ఆగ్రహిస్తారని అనుకున్నారేమో గానీ.. అంతలోనే జగన్ వాదనను రిపీట్ చేశారు. వైసీపీకి 11 సీట్లు మాత్రమే ఎందుకొచ్చాయో అర్థం కావడం లేదని, ఆ మాటకొస్తే.. కూటమికి 164 సీట్లు ఎలా వచ్చాయో వారికి కూడా అర్థం కావడం లేదని అంబటి చెప్పుకొచ్చారు.

మూడు పార్టీలు కలవడం వల్ల సీట్లు పెరిగాయా? వైసీపీపై తెలియని వ్యతిరేకత ఉందా? ఏదైనా మాయ జరిగిందా అనే అనుమానాలున్నాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన పరిపాలన గురించి ప్రజలు ఛీత్కరించుకున్నారు.. విధ్వంసక పాలనకు తెరదించాలనుకున్నారు. ఈ వాస్తవాన్ని గుర్తించకుండా మాయ జరిగినదంటూ మభ్యపెట్టే మాటలు మాట్లాడినంత కాలం.. వైసీపీ నాయకులు తమను తాము మోసం చేసుకుంటున్నట్టే. ఈ అభిప్రాయంతో ఉన్నంత వరకు వారి పార్టీకి భవిష్యత్తు కూడా ఉండదు. తప్పులను గ్రహించి దిద్దుకుంటేనే కొన్నాళ్లకు తిరిగి నిలదొక్కుకోగలుగుతారు.. అని ప్రజలు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles