కొన్ని వారాలుగా రాష్ట్రంలో ఒకటే హాట్ టాపిక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో బూతు, అసభ్య తప్పుడు పోస్టులు పెట్టే సైకోలు వారి మీద పోలీసులు నమోదు చేస్తున్న కేసులు, జరుగుతున్న అరెస్టులు.. అంతా ఒకటే వ్యవహారం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా సైకోలకు మద్దుతగా ఆ పార్టీ నాయకులంతా ప్రెస్మీట్లు పెట్టి రెచ్చిపోయి స్పందిస్తున్నారు. అదే సమయంలో.. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను సైతాన్లుగా అభివర్ణిస్తూ, జగన్ ను సైతాన్ల నాయకుడిగా అభివర్ణిస్తూ వారి ద్వారా బాధితుల్లో ఒకరైన షర్మిల దుమ్మెత్తిపోస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో జగనన్న కళ్లలో ఆనందం చూడడమే తన లక్ష్యం అన్నట్టుగా ఒక మాజీ జర్నలిస్టు, జగన్ ప్రాపకంలో లబ్ధి పొందుతూ వచ్చిన వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెట్టడమే నేరం అన్నట్టుగా ఆయన హైకోర్టులో పిటిషన్ వేయగా.. హైకోర్టు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతటితో ఊరుకోలేదు. దీనిని రాజకీయ దురుద్దేశంతో వేసిన పిటిషన్ గా అభివర్ణిస్తూ.. అతనికి యాభైవేల రూపాయల జరిమానా కూడా విధించారు.
పోలా విజయబాబు గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. వైఎష్ జగన్మోహన్ రెడ్డి ప్రాపకంలో ఉన్న అనేకమందిలో ఆయన కూడా ఒకరు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. పోలా విజయబాబు ఒక పర్యాయం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమిషనర్ గా పనిచేశారు. తర్వాత అధికార భాష సంఘం అధ్యక్ష పదవిని కూడా జగన్ కట్టబెట్టారు. జగన్ అత్యంత దారుణంగా ఓటమి పాలైన తర్వాత సహజంగానే ఆ పదవి కూడా లేకుండాపోయింది. ఇప్పుడు సదరు పోలా విజయబాబు వైఎష్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల వాదనలు వినిపించడానికి, వారి సొంత టీవీ ఛానెల్ చర్చా వేదికల్లో పాల్గొంటూ ఉంటారు.
అలాంటి విజయబాబు.. సోషల్ మీడియా సైకోలమీద కేసులు నమోదు చేయడాన్నే తప్పుపడుతూ, ప్రశ్నిస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ సందర్భంగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఎవరికైనా కళ్లు తెరిపించేవే. సోషల్ మీడియా ద్వారా రెండువేల మంది నిత్యం వల్గర్ లాంగ్వేజీలో దూషణలు చేస్తూ అసభ్య పోస్టులు పెడుతూ అందరినీ భయబ్రాంతులకు గురిచేస్తున్నారని.. అలాంటి వారిని పోలీసులు చట్టం ముందు నిలబెట్టడం తప్పా అని హైకోర్టు ప్రశ్నించింది.
ఇలాంటి పోస్టులు పెడుతున్నవారు ఖరీదైన ఫోన్లు వాడుతున్నారని.. అక్కడికేదో సామాన్య పేద ప్రజలకు అన్యాయం జరుగుతున్నట్టు పిల్ వేయడంలో అర్థం లేదని పేర్కొంది. ఒకే ఉద్దేశంతో వందల మంది అసభ్య పోస్టులు పెడుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించింది. పిటిషన్ వేసిన పోలా విజయబాబు.. నెల రోజుల్లోగా రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీకి రూ.50 వేల జరిమానా చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది. జగన్ భక్తితో ఆయన కళ్లలో ఆనందం చూడడానికి సైకోల తరఫున వకాలత్తు పుచ్చుకుని ఎదురుదెబ్బతినాల్సి వచ్చింది.