మామయ్య మాట వినిపిస్తోందా జగన్!

Monday, October 28, 2024

‘కలకంఠి కంట కన్నీరొలికిన సిరి ఇంటనుండ నొల్లదు సుమతీ..’ అంటారు పెద్దలు. మహిళను ఏడిపిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు అని హిందూధర్మం చెబుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీ ఫాలో అవుతారు గనుక.. ఈ లక్ష్మీదేవికి నాకు సంబంధం లేదు అని అనుకుంటారో లేదా.. నా వ్యక్తిగత రాజ్యాంగంలో ఆడవాళ్లను ఏడిపిస్తేనే సంపద ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది అనుకుంటారో తెలియదు గానీ.. ఆయన ఇప్పుడు అదే పని చేస్తున్నారు.

జగన్మోహన్ రెడ్డి చెల్లెలికి పంచి ఇచ్చిన ఆస్తులను వెనక్కు లాక్కోవడానికి, ఇప్పుడు కోర్టుకు వెళ్లిన తీరు పట్ల సర్వత్రా చర్చ నడుస్తోంది. వైఎస్ షర్మిల ప్రెస్ మీట్ లోనే అదుపు చేసుకోలేని విధంగా అన్న చేస్తున్న ద్రోహాన్ని తలచుకుని ఏడ్చారు. ఈ పరిస్థితుల్లో పై సామెత చెప్పే నీతినే.. జగన్ కు ఆయన మామయ్య కూడా చెబుతున్నారు. ఒకప్పట్లో మామయ్య ఆయనకు ఆత్మీయుడే గానీ..  ఇప్పుడు ఆ మామ మాటను జగన్ చెవిన వేసుకుంటారనే నమ్మకం మాత్రం ప్రజలకు కలగడం లేదు.

జగన్ మామయ్య ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. వైఎస్సార్ కుటుంబ ఆస్తుల వివాదం విషయంలో తాజాగా స్పందించారు. వైవీ సుబ్బారెడ్డితో తీవ్రంగా విభేదించే ఆయన వైవీ స్పందించిన రెండు రోజుల తర్వాత స్పందించడం విశేషం. ప్రస్తుతం జనసేనలో ఉన్న బాలినేని శ్రీనివాసనెడ్డి- తాను ఏ పార్టీలో ఉన్నా సరే.. వైఎష్సార్ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నట్టుగా చెబుతున్నారు.

కుటుంబ ఆస్తుల కోసం అన్నా చెల్లెలు తగాదా పడడం బాధ కలిగిస్తోందని బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించడం విశేషం. ఆడబిడ్డ కన్నీరు పెట్టడం అనేది ఆ ఇంటికి అరిష్టం అని జగన్ కు సలహా ఇచ్చారు. హైదరాబాదులో మీడియా మీట్ నిర్వహించిన బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు హితవు చెప్పారు.
బాలినేని ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి జనసేనలో చేరారు. కాబట్టి ఇప్పుడు జగన్ దళాలు అందరూ బాలినేని మీద కూడా ఎదురుదాడికి దిగి.. పవన్ కల్యాణ్ స్కెచ్ ప్రకారమే ఆయన ఇలా మాట్లాడుతున్నారని ఆరోపించవచ్చు.

ఇప్పటిదాకా జగన్ దళాలు షర్మిలను వెనుకనుంచి చంద్రబాబునాయుడు నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ పేరును కూడా ఇందులోకి లాగవచ్చు. తమకు ఎవరు మంచి మాటలు చెప్పినా సరే.. వారిని నిందించడానికి జగన్ తైనాతీలు అత్యుత్సాహం చూపించవచ్చు. కానీ.. బాలినేని చెబుతున్న హిత వాక్యాలు జగన్ చెవికెక్కుతాయా? లేదా? అనేది కీలకం. మోనార్క్ లా వ్యవహరించే జగన్ తాను అమీ తుమీ తేల్చుకోవాలని అనుకుంటారే తప్ప.. ఇతరులు చెప్పే మంచి మాటలు వినే అవకాశమే లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles