సరస్వతికి మరో చిక్కు : రైతులు కోర్టుకు వెళతారా?

Thursday, November 7, 2024

సరస్వతీ పవర్ సంస్థకు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. ఆ సంస్థకోసం సుమారు పదిహేనేళ్ల కిందట అత్యంత చవకైన ధరలకు భూములు అమ్మిన రైతులు ఇప్పుడు అడ్డం తిరుగుతున్నారు. భూములను చవగ్గా తీసుకుంటూ.. సరస్వతీ సంస్థ తమకు ఎలాంటి వాగ్దానాలు చేసిందో అవేమీ నెరవేర్చలేదని.. పదిహేనేళ్లు గడచిపోతుండగా.. ఇప్పటిదాకా కంపెనీ పనులు కూడా ప్రారంభించలేదని.. తమ భూములు తమకు ఇచ్చేయాలని వారు కోరుతున్నారు. సరస్వతీ సంస్థ తమను మోసం చేసిందని అంటున్నారు. ఈ మోసంపై కోర్టుకు వెళ్లడానికి కూడా రైతులు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.

పల్నాడు జిల్లా పరిధిలో ఇంచుమించుగా 1500 ఎకరాలకు పైగా భూములను సరస్వతీ పవర్ సంస్థ సమీకరించింది. ఈ భూముల్లో సిమెంటు పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నట్టుగా అప్పట్లో సంస్థ రైతులకు హామీ ఇచ్చింది. మీ కుటుంబాలకు అందులో ఉద్యోగా, ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తాం అని సంస్థ నమ్మబలికింది. గ్రామం బాగుపడుతుందని, తమ జీవితాలు బాగుంటాయని, తమ పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయనే నమ్మకంతో రైతులు అత్యంత చవకధరలకు భూములను అమ్మేశారు. అప్పటినుంచి సరస్వతి సంస్థ ఆస్తులను ఏర్పాటు చేసుకున్నదే తప్ప అక్కడ కంపెనీ ప్రారంభించే ఆలోచన చేయనేలేదు.

ఇప్పుడు మాచవరం మండలంలోని చెన్నాయపాలెం గ్రామానికి చెందిన రైతులు ఈ వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఉద్యోగాల ఆశచూపి వంచించారని, పదిహేనేళ్లుగా అలాంటి పనే చేయలేదు గనుక.. తమ భూములు తమకు తిరిగి ఇవ్వాలని వారు కోరుతున్నారు. లేకుంటే, ఇప్పటి ధరల ప్రకారం ఎకరాకు రూ.18 లక్షలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

గ్రామానికి మౌలిక వసతులు, కుటుంబాల్లో ఉద్యోగాలు వంటి అనేక హామీలు ఇచ్చి భూములు కొట్టేశారు. కానీ అసలు పరిశ్రమ జోలికే వెళ్లలేదు. పరిశ్రమ  పనులు ప్రారంభించే వరకు తమ పొలాలు తాము సాగు చేసుకుంటాం అని, పనులు మొదలయ్యాక ఇచ్చేస్తాం అని అడిగినప్పటికీ సంస్థ ఒప్పుకోలేదని వారు అంటున్నారు. కొందరు రైతులు మధ్యలో పంటలు సాగుచేస్తే అప్పట్లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో వందల మందిని ట్రాక్టర్లతో తీసుకువచ్చి ఆ పొలాలను దున్నించేశారు. అంత దుర్మార్గంగానూ వ్యవహరించారు.

భూములు తీసుకున్న ప్రయోజనం నెరవేర్చకపోగా, తమకు ఇచ్చిన హామీలు కూడా తుంగలో తొక్కినందుకు ఈ భూముల విక్రయం జరిగిన తీరు మీద అమ్మిన రైతులు అవసరమైతే కోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తమకు న్యాయం జరగాలని రైతులు కోరుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles