ఇంతకూ జగన్మోహన్: రెడ్డి ఈ నెల 24 వ తేదీన ఢిల్లీలో ఎందుకు ధర్నా చేయాలనుకున్నారు? మనకు తెలిసినంత వరకు వినుకొండలో రషీద్ అనే రౌడీషీటర్ హత్యకు గురైతే.. రాష్ట్రమంతా శాంతి భద్రతలు అదుపుతప్పిపోతున్నాయని, వాటిని కాపాడాలనే కోరికతో ఆయన ఢిల్లీ దీక్షకు పూనుకున్నారు. ఇదంతా ఒక డ్రామా అన్నట్టుగా ఆయన చెల్లెలు, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెండు రోజుల ముందుగానే అసలు గుట్టు బయటపెట్టేశారు. అసలు వినుకొండలో జరిగినది కేవలం వ్యక్తగత కక్షల హత్య అని, రాజకీయ హత్య కానేకాదని ఆమె అంటున్నారు.
చెల్లెమ్మ షర్మిలకు అర్థమైన సంగతి, అన్నయ్య జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదా? వినుకొండలో జరిగిన హత్య మూలాలను ఆయన ఆ మాత్రం గ్రహించలేకపోయారా? అనేది అందరికీ కలుగుతున్న సందేహం. నిజం చెప్పాలంటే.. జగన్ కు ఆ విషయం అర్థం కాక కాదు! అర్థం కానట్టుగా ఆయన నటిస్తున్నారు. నిద్రపోయే వాడిని లేపవచ్చు గానీ, నిద్ర నటించే వాడిని లేపడం ఎలాగ? అని ఒక సామెత ఉంటుంది. అలాగ.. తెలియనట్టు నటించే జగన్ కు అర్థమయ్యే లా చెప్పడం కూడా దండగ. ఒక రౌడీ షీటరు వ్యక్తిగత హత్యను.. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ముడిపెట్టాలని అనుకున్నప్పుడే.. జగన్మోహన్ రెడ్డి యొక్క చవకబారుతనం బయటపడిపోయింది. ఆ విషయాన్ని ఇవాళ చెల్లెమ్మ షర్మిల కూడా బయటపెట్టారు.
జగన్ చాలా అతిశయంగా.. రాష్ట్రంలో ఇప్పటికి 36 రాజకీయ హత్యలు జరిగాయని అనడం ద్వారా అభాసు పాలయ్యారు. అయితే 35 హత్యల సమయంలో లేని స్పందన ఆయనలో ఇప్పుడు హఠాత్తుగా ఎందుకు వచ్చింది? ఇప్పుడు చనిపోయినది వినుకొండలోని ప్రముఖ రౌడీ షీటరు గనుక జగనన్న మనసు ఎక్కువగా గాయపడిందా? అనేది పలువురి ప్రశ్న.
ఇంతా కలిపి.. 24న జగన్ తలపెట్టే దీక్షఎలా జరుగుతుందో తెలియదు. దీక్ష చేస్తే వచ్చే ఎడ్వాంటేజీ ఆయనకు ఎంత మాత్రం ఉంటుందో తెలియదు గానీ.. చేసేలోగా.. ఆయన కుట్రబుద్ధులు బయటపడిపోయి మరింతగా భ్రష్టు పట్టే ప్రమాదమే ఎక్కువగా కనిపిస్తోంది. జగన్ పరిణతి గల నాయకుడిలాగా వ్యవహరించాలని, అధికార పక్షాన్ని విమర్శించేప్పుడు.. పసలేని అంశాలు ఎంచుకోకుండా, నవ్వులపాలుకాకుండా జాగ్రత్తపడాలని ప్రజలు అంటున్నారు.
జగన్ డ్రామాని బయటపెట్టేసిన చెల్లెమ్మ!
Wednesday, December 18, 2024