జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగుతున్న రోజుల్లో సామాన్యుల మీద ప్రభుత్వం రాజద్రోహం కేసులు నమోదు చేయడం అనేది విచ్చలవిడిగా ఉండేది. పాపం.. అప్పట్లో అరెస్టు అయి జైళ్లకు వెళ్లిన, పోలీసుల హింసను ఎదుర్కొన్న అనేక మంది సామాన్యులకు అభివృద్ధిని మాత్రమే కోరుకునే వాళ్లకు , ఇప్పటి వైసీపీ వారికి ఉన్నన్ని తెలివితేటలు లేవు. అందుకే వారు జైళ్లకు వెళ్లాల్సి వచ్చింది. అదే ఇప్పుడైతే వైసీపీ వారి తెలివితేటలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వారు ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి మీద కూడా వ్యక్తిగత దూషణలతో, అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేస్తూ కూడా.. అరెస్టుకాకుండా కోర్టు ద్వారా రక్షణ పొందగలుగుతున్నారు. అయినా సరే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ను కుప్పం పోలీసులు అరెస్టు చేశారు.
వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఇటీవలి కాలంలో వివాదాలకు కేంద్రబిందువుగా మారారు. ముఖ్యమంత్రి మీద, డిప్యూటీ ముఖ్యమంత్రి మీద అనుచితమైన భాషలో తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా విపరీతంగా దూషించారు. ఆయన మీద పలు పోలీసుకేసులు నమోదు అయ్యాయి. కుప్పంలో కేసు నమోదు కాగా, ఆ కేసు కొట్టేయాలని నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 25 దాకా ఈ కేసులో అరెస్టు వద్దంటూ కోర్టు ఆదేశించింది. అయితే తాజాగా బెంగుళూరు నుంచి వస్తున్న నాగార్జున యాదవ్ ను కుప్పం పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను కోర్టు ఆదేశించిన కేసులోనే అరెస్టు చేశారా? లేదా ఇతరత్రా ఇంకేమైనా కేసులు ఆయనపై ఉన్నాయా అనేది తెలియలేదు.
అరెస్టు సంగతి ఎలా ఉన్నప్పటికీ.. నీచమైన భాషలో రెచ్చిపోతూ ఉండే వైసీపీ అభిమానులు గమనించాల్సిన ముఖ్యమైన సంగతి ఇందులో ఒకటి ఉంది. చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్టు చేయడానికి పోలీసులు వెనుకాడ్డం లేదు. మీనమేషాలు లెక్కిస్తూ కూర్చోవడగం లేదు. తప్పుడు భాషలో తిడితే అరదండాలు పడతాయి. జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అని వారు గ్రహించాలి.
వివిధ ప్రాంతాల్లోని అనేక మందిత వైసీపీ వారి మీద అనుచిత భాషలో తిట్టినందుకు పోలీసులు కేసులు నడుస్తున్నాయి. అందరి అరెస్టు కూడా జరుగుతందని అంతా అంటున్నారు. జగన్ సీఎంగా ఉండగా.. ప్రభుత్వ విధానాల మీద విమర్శలు చేసినా సరే రాజద్రోహం కేసులు పెట్టేవారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం వేధింపులు, కక్ష సాధింపులు తగదని చాలా ఉదారంగా ఉంది. కానీ ఇప్పటికీ రెచ్చిపోయి చెత్తగా మాట్లాడేవాళ్లని మాత్రం ఉపేక్షించేది లేదని ఈ అరెస్టు నిరూపిస్తోంది.
అనుచితమైన మాటలకు అరెస్టులు షురూ!
Sunday, November 3, 2024