ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ శవాసనం వేసి ఉన్న సంగతి అందరికీ తెలుసు. అయితే ఈసారి ఆ పార్టీకి కొంత జవసత్వాలు వస్తాయా? కొంత తిరిగి పుంజుకుంటుందా? అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బోణీ కొట్టే అవకాశం ఉన్నదా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. కాంగ్రెసు పార్టీకి 2019 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పోటీచేస్తే దక్కినది ఒక్క శాతం ఓటు మాత్రమే. దానికి తోడు కేంద్రంలో కూడా అధికారంలో లేని దుస్థితి. అలాంటి పార్టీ ఈ రాష్ట్రంలో మళ్లీ లేచి నిలబడుతుందని ఎవ్వరూ అనుకోలేదు. కానీ తెలంగాణ రాజకీయాలనుంచి విరమించుకుని, వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ సారథ్య బాధ్యతలు తీసుకున్న తర్వాత కాస్త ఊపు వచ్చింది. ఎన్నికల సమయంలో ఆమె స్వయంగా తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన కడప ఎంపీ స్థానంనుంచి బరిలోకి దిగుతూ ఉండడం, రాష్ట్రవ్యాప్తంగా ఇతర పార్టీల నుంచి కూడా కొందరు రకరకాల కారణాల వల్ల కాంగ్రెసులోకి రావడం వారికి ఆశావహ పరిణామం.
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని మొత్తం 25 పార్లమెంటు, 175 అసెంబ్లీస్థానాలకు కూడా పోటీచేయబోతున్నది. అభ్యర్థులను విడతలుగా ప్రకటిస్తూ వస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సిటింగ్ ఎమ్మెల్యేలుగా ఉంటూ టికెట్ దక్కించుకోలేకపోయిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇప్పుడు కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నారు. వారి నియోజకవర్గాల్లో వారు ఈ అయిదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నారు గనుక.. ఎంతో కొంత ఓటు బ్యాంకును కలిగి ఉంటారని అనుకోవచ్చు. కానీ వారి రూపేణా కాకపోయినా.. ప్రకాశం జిల్లాలో బలమైన నాయకుడు ఆమంచి కృష్ణమోహన్ రూపంలో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎడ్వాంటేజీ కనిపిస్తోంది.
చీరాలనుంచి గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఆమంచి కృష్ణమోహన్ మొన్నటిదాకా వైఎస్సార్ కాంగ్రెస్ లో ఉండి ఆ పార్టీ ఎక్కడా టికెట్ ఇవ్వకపోవడంతో.. కాంగ్రెసులో చేరబోతున్నారు. ఆల్రెడీ షర్మిలతో భేటీ కూడా అయ్యారు. కాంగ్రెసు తరఫున ఎమ్మెల్యేగా చీరాల బరిలో ఉంటానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన గట్టి పోటీ ఇవ్వగలరనే అభిప్రాయం పలువురిలో ఉంది. గెలుస్తారని పార్టీ అనుకుంటోంది.
చీరాలకు ప్రస్తుత ఎమ్మెల్యే కరణం బలరాం కాగా ఆయన వలస నాయకుడు. తెలుగుదేశం తరఫున 219లో గెలిచి వైసీపీలోకి వెళ్లి, ప్రస్తుత ఎన్నికల్లో తన కొడుకు వెంకటేష్ ను పోటీచేయిస్తున్నారు. ఆయనతో ఆమంచికి విభేదాలున్నాయి. ఆమంచికి ఉన్న ఎడ్వాంటేజీ ఏంటంటే.. ఆయన మొన్నటిదాకా వైసీపీలోనూ, అంతకుముందు తెలుగుదేశంలో కూడా పనిచేశారు. నియోజకవర్గంలో తనకంటూ సొంత వర్గం, బలం ఉన్నాయి. వీటి నేపథ్యంలో ఆయన గెలిచినా గెలవవచ్చునని, అలా జరిగితే.. విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత.. తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ శాసనసభలో అడుగుపెట్టినట్టు అవుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నికల్లోనూ బోణీ కొడుతుందా?
Thursday, November 21, 2024