వాలంటీర్ల బరితెగింపు : మళ్లీ జగనన్నే.. మళ్లీ నేనే..!

Monday, May 20, 2024

వాలంటీరు అనే చిన్న ట్యాగ్ లైన్ ఉండడం అనేది ఇన్నాళ్లూ వారికి ఒక హోదా లాగా ఉండింది. గత కొన్ని వారాలుగా ఆ హోదా వారిని కంట్రోల్ చేసే  ఒక ముకుతాడులాగా మారింది. ఇప్పుడు వారు దానిని వదిలించుకుంటున్నారు. వాలంటీరు పదవికి రాజీనామాలు చేసేస్తున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలు.. ఇక ఎన్నికల ప్రచార పర్వంలో బరితెగించేస్తున్నారు. గత అయిదేళ్లుగా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు అందరితోనూ ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి గనుక.. ఇప్పుడు రెచ్చిపోయి ప్రచారం చేస్తున్నారు. వాలంటీరు పోస్టులకు రాజీనామాలు చేసినప్పటికీ.. ‘రాబోయేది మళ్లీ జగనన్నే.. వాలంటీరుగా మళ్లీ రాబోయేది కూడా నేనే..’ అంటూ వారు బరితెగిస్తున్నారు.

వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలనేది ఈసీ నిర్ణయం. అలాగే వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే వేటు వేస్తున్నారు కూడా. ఈ తకరారులన్నీ లేకుండా.. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు అయిన వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేసేసి… బహిరంగంగానే నేతల వెంట తిరుగుతున్నారు. ఈ రెండు నెలల పాటు వారికి అభ్యర్థులే జీతం కంటె ఎక్కువే చెల్లించేలా ఒప్పందం చేసుకుంటున్నారు. అభ్యర్థులు కూడా ఇప్పుడు రాజీనామాలు చేయండి.. ఏం పర్లేదు.. ఎన్నికలు ముగిసి జగనన్న ప్రభుత్వం మళ్లీ ఏర్పడిన తర్వాత.. మళ్లీ మిమ్మల్నే మీమీ వాలంటీర్ పోస్టుల్లోనియమిస్తుంది.. అని అభ్యర్థులు వారిని మభ్యపెడుతున్నారు.


ఈ హామీ.. ఆ వాలంటీర్లు బరితెగించడానికి కారణం అవుతోంది. ఇన్నాళ్లూ వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం వస్తే గనుక.. పెన్షన్లు ఆగిపోతాయి. ఇంటిదగ్గరకు తెచ్చి యివ్వడం జరగదు.. అంటూ రకరకాలుగా లబ్ధిదార్లను భయపెడుతూ వచ్చారు. అయితే.. వీరి విషప్రచారానికి విరుగుడు ప్రచారాలు తెలుగుదేశం దళాలు సమర్థంగానే చేశాయి. పింఛన్లు ఆగవు సరికదా.. పెరుగుతాయని, ఇంటివద్దకే  వస్తాయని అందరికీ కమ్యూనికేట్ అయింది. అయితే ఇప్పుడు వాలంటీర్లు కూడా తమ టోన్ మారుస్తున్నారు.

మళ్లీ జగనన్నే గెలుస్తాడని.. మళ్లీ నేనే వాలంటీరుగా వస్తానని.. అంటున్నారు. మీరు ఓటు వేయకపోతే గనుక ఆ విషయం మాకు తెలుస్తుందని, అప్పుడిక మీ సంగతి చూస్తామని బెదిరిస్తున్నట్టుగా వారి ధోరణి సాగుతోంది. నిన్నటిదాకా వాలంటీర్లుగా వస్తూన్న వారు.. ఇవాళ వైసీపీ నేతల వెంట ప్రచారానికి రావడం మాత్రమే కాకుండా, ఓటు వేయడానికి పెడుతున్న ఒత్తిడిని లబ్ధిదారులు తట్టుకోలేకపోతున్నారు. మరి వీరికి కళ్లెం వేయడం ఎలా సాధ్యమవుతుందో చూడాలి. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles