చంద్రబాబునాయుడు మీద అవినీతి కేసులు బనాయించి.. ఆయనను రిమాండులో జైల్లో పెట్టిన వెంటనే.. తెలుగుదేశం పార్టీ మొత్తం కుదేలైపోతుందని, నీరుగారుతుందని, వారి నైతిక స్థైర్యం దెబ్బతింటుందని, ఆ రకంగా తాము పైచేయి సాధించవచ్చనే వ్యూహాత్మక ఆలోచన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఏదైనా ఉన్నట్లయితే.. వారు పునరాలోచనలో పడాల్సిందే. పార్టీ అధినేతను జైల్లో పెడితే.. పార్టీ నిర్ణయాత్మకంగా వ్యవహరించలేక వెనుకంజలో పడుతుందనే వారి అంచనాలు దెబ్బతింటున్నాయి. పార్టీ మరింత జాగ్రత్తగా సమష్టిగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నది.
తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. జనసేన పార్టీతో సమన్వయం చేసుకోవడానికి, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడానికి, నిర్వహించడంలో కలిసి అడుగులు వేయడానికి వీలుగా ఈ నిర్ణయం దోహదపడుతుంది. జనసేన తో సమన్వయం కోసం తెలుగుదేశం పార్టీ ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులుగా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చం నాయుడు, సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య ఉన్నారు. వీరందరూ కూడా సీనియర్లు, అనుభవజ్ఞులు కావడంతో రెండు పార్టీలను సమన్వయం చేసుకునే దిశగా పురోగతి ఆశాజనకంగా ఉంటుందని కార్యకర్తలు భావిస్తున్నారు.
జనసేన పార్టీ ఇప్పటికే తెలుగుదేశంతో సమన్వయం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. నాదెండ్ల మనోహర్ సారథ్యంలో ఆ కమిటీ పని చేస్తుంది. . ఇరువైపుల నుంచి అనుభవజ్ఞులే కమిటీ లో ఉన్నందువలన.. ఎలాంటి చికాకులు, అభిప్రాయ భేదాలు, అసంతృప్తులు రేకెత్తకుండా అడుగులు పడతాయని పలువురు భావిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నంత మాత్రాన పార్టీకి సంబంధించిన కీలక నిర్ణయాలు జరగకుండా నిస్టేజం అవుతుందనే కుట్ర ఆలోచన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ కొంచమైనా ఉన్నట్లయితే అది తప్పని తేలుతోంది. నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు జైలుకు పంపడం వలన తటస్థ ఓటర్లలో ఆయన పట్ల సానుభూతి పెరుగుతుంది. తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది. ఈ సమయంలో విపక్ష పార్టీలు ఉమ్మడిగా పని చేయడం అనేది, జగన్ వ్యతిరేకులందరికీ శుభపరిణామం అని విశ్లేషకులు భావిస్తున్నారు.