సీమెన్స్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందం ఒక పెద్ద బోగస్ అని, 90- 10% నిష్పత్తితో పెట్టుబడులు పెట్టే లాగా వారితో ఒప్పందం కుదుర్చుకుని.. రాష్ట్ర ప్రభుత్వ వాటా డబ్బులు మాత్రం విడుదల చేసి ఆ మొత్తం 371 కోట్లను చంద్రబాబు నాయుడు కాజేశారని ఆరోపిస్తూ సిఐడి ఆయనను అరెస్టు చేసి ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఉంచింది. చంద్రబాబు నాయుడు అరెస్టు దగ్గర నుంచి, కోర్టులో వాదోపవాదాల సందర్భంగా కూడా.. ఒప్పందం కుదిరినప్పటి సీమెన్స్ కంపెనీ భారత వ్యవహారాల యండి సుమన్ బోస్ చెప్పిన విషయాలంటూ సిఐడి అధికారులు అనేక సంగతులు ప్రస్తావించారు. అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు నేరం చేశారని, డబ్బు కాజేశారని ఆరోపించే సంగతులే. సుమన్ బాస్ చెప్పిన వివరాల ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వ వాటా డబ్బులు మొత్తం షెల్ కంపెనీలకు తరలిపోయినట్లుగా సిఐడి చీఫ్ విలేకరుల సమావేశాల్లో కూడా వెల్లడించారు. కోర్టులో కూడా వారి న్యాయవాదులు ఇదే విషయాలను పేర్కొన్నారు.
అయితే సీమెన్స్ సంస్థకు అప్పటి ఎండి సుమన్ బోస్ పేరుతో ఏ పుకార్లనైతే వీరందరూ ఇప్పటిదాకా వ్యాప్తి చేస్తూ వచ్చారు అవన్నీ కూడా కట్టుకథలే అని తేల్చేసే పరిణామం ఆదివారం వెలుగులోకి వచ్చింది. సుమన్ బాస్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఈ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని తేల్చి చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టు అనేది నూటికి నూరు శాతం విజయవంతమైందని ఆయన వెల్లడించారు. 2014లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం ముందుకు వచ్చిందని, ఒప్పందంలో భాగంగా 40 ప్రాంతాలలో 2 లేబరేటరీలను సంస్థ ఏర్పాటు చేసిందని సుమన్ బోస్ వెల్లడించారు. 2021 నాటికి 2.32 లక్షల మంది ఈ సంస్థ ద్వారా నైపుణ్యాలను పెంచుకొని ఉద్యోగాలు సాధించారని కూడా ఆయన తెలియజేశారు. 2021 తర్వాత అనూహ్యమైన రీతిలో, అప్పటిదాకా అంతా బాగా జరిగిందని మెచ్చుకున్న సంస్థ వారే ప్రాజెక్టు బోగస్ అని ఆరోపించడం ప్రారంభించారని, ఒక్క కేంద్రాన్ని లేబరేటరీని కూడా సందర్శించకుండానే, తనిఖీ చేయకుండానే అంతా బోగస్ అని చెప్పడం ఆశ్చర్యంగా ఉందని సుమన్ బోస్ పేర్కొనడం విశేషం.
సీమెన్స్ తో చేసుకున్న ఒప్పందాల్లోలోపాలేమీ లేవని ఆయన అంటున్నారు. సీమెన్స్ తో బోగస్ ఒప్పందం చేసుకున్నట్టుగా చెబుతున్న వారు ఇప్పటిదాకా ఒక్క ఆధారం కూడా చూపలేదని కూడా సుమన్ బోస్ ఆరోపిస్తుండడం విశేషం. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వాస్తవాలను న్యాయస్థానంలోనే చెబుతామని కూడా ఆయన అంటున్నారు. ఎవరి పేరు వాడుకొని, చంద్రబాబు నాయుడు అక్రమాలు చేసినట్లుగా వైసిపి దళాలు ప్రచారం చేస్తున్నాయో ఆయనే స్వయంగా ఇప్పుడు తెర ముందుకు వచ్చి ఆరోపణలన్నింటినీ ఖండిస్తూ ఉండడం విశేషం. చంద్రబాబు నాయుడు తప్పు చేసినట్లుగా న్యాయస్థానం ఎదుట విచారణ జరిగేప్పుడు సుమన్ బోస్ చెప్పే సాక్ష్యాలు చాలా ప్రభావం చూపిస్తాయని పలువురు అంచనా వేస్తున్నారు.