భారత రాష్ట్ర సమితి అభ్యర్థుల జాబితాను ప్రకటించేసిన తర్వాత ఆ పార్టీలో పెద్దపెట్టున అసంతృప్తులు రేగుతున్నాయి. ఇది ఆశ్చర్యకర పరిణామం ఎంత మాత్రమూ కాదు. అయితే వారందరూ కూడా పార్టీకి అనుకూలంగా మాత్రమే పనిచేసేలాగా ప్రేరేపించడానికి భారాస నాయకులు కష్టపడుతున్నారు. కేసీఆర్ స్థాయిలో కీలక నాయకులకు అందరికి తాయిలాలు ప్రకటించి వారిని ఊరుకోబెడుతున్నారు. ఈ తాయలాల ద్వారా వారిని బుజ్జగించడం సంగతి ఏమోగానీ, కచ్చితంగా పార్టీ విజయం కోసం కష్టపడి పని చేయాల్సి వచ్చేలాగా వారిని లాక్ చేస్తున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
పట్నం మహేందర్ రెడ్డి, చెన్నమనేని రమేష్ ఇద్దరికీ ప్రకటించిన కీలక పదవుల నేపథ్యంలో ఈ పరిణామాలను గమనిస్తున్న వారికి ఆ అభిప్రాయమే కలుగుతోంది. సామాజికవర్గాల సమీకరణల పరంగా ఈ ఇద్దరు నాయకులు కూడా చాలా కీలకం. ఈ వర్గాల నాయకులకు టికెట్ నిరాకరించడం అనేది.. కేవలం వారి నియోజకవర్గాల్లో మాత్రమే కాకుండా, ఇతర ప్రాంతాల్లో కూడా పార్టీ మీద ప్రభావం చూపించే అవకాశం ఉన్నదనేది పార్టీ నాయకత్వానికి భయం. అలాగే వారు అలిగి ఇతర పార్టీల్లో చేరితే గనుక.. అది ఇంకా నష్టదాయకం అనే అభిప్రాయం కూడా ఉంది. అందుకే అలిగిన వారు చాలా మంది ఉన్నప్పటికీ.. ఆ ఇద్దరికి మాత్రం తక్షణం పదవులు కట్టబెట్టారు. పట్నం మహేందర్ రెడ్డిని ఏకంగా మంత్రిగా కేబినెట్లోకి తీసుకోగా, చెన్నమనేని రమేష్ ను కేబినెట్ హోదాతో అయిదేళ్ల పాటు ఉండే సలహాదారు పదవిలోకి తీసుకున్నారు.
ఇంతకూ ఈ పదవులు వీరికి నిజంగా వరాలేనా? లేదా, వారిలో ఎన్నికల నాటికి దొంగచాటుగా పార్టీకి చేటు చేసే కుట్రలు చేయకుండా లాక్ చేసిన వ్యూహమా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. పట్నం మహేందర్ రెడ్డికి , ఎన్నికల తర్వాత ఏర్పడే కేబినెట్లో కూడా మంత్రి పదవి కొనసాగుతుందని హామీ ఇచ్చినట్టు సమాచారం. అదే విధంగా.. చెన్నమనేని రమేష్ కైతే ఎటూ అయిదేళ్ల పదవి అనేది ఖరారే. అయితే భారాస ప్రభుత్వం మళ్లీ ఏర్పడడం అనేది కంపల్సరీ. అంటే ఆయన తన పదవిని కాపాడుకోవాలంటే.. పార్టీ విజయానికి తన వంతు కృషి తప్పకుండా చేయాల్సిందే.
అంటే ఈ ఇద్దరు నాయకులు కూడా విధిగా పార్టీ విజయానికి కృషి చేయాలన్నమాట. ఈ ఇద్దరు నాయకులు కీలకం కావడంతో వారిని తాయిలాలతో కేసీఆర్ లాక్ చేశారని.. మిగిలిన తిరుగుబాటు నాయకుల్ని లైట్ తీసుకున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. మైనంపల్లి హన్మంతరావును లైట్ తీసుకోవడానికి కూడా ఈ సమీకరణలే కారణం అని తెలుస్తోంది.