వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్టణంలో ‘విశాఖ బీసీ గర్జన’ సభ ను నిర్వహించింది. ఆ పార్టీకి ఉత్తరాంధ్ర వ్యవహారాల పార్టీ ఇన్చార్జి వైవీ సుబ్బారెడ్డి, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తెలంగాణకు చెందిన బీసీ నాయకుడు, వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య తదితరులు అతిథులుగా హాజరయ్యారు.
ఆర్ కృష్ణయ్య జగన్ ద్వారా పార్లమెంటులోకి ప్రవేశించిన నాయకుడు గనుక.. జగన్మోహన్ రెడ్డిని వేనోళ్ల శ్లాఘించడానికి తన శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. ‘ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు.. సంఘ సంస్కర్త’ అంటూ కితాబులు ఇచ్చారు. జగన్ అంటే.. ఒక ఏసుప్రభువు, ఒక అల్లా, ఒక కృష్ణపరమాత్మ అంటూ నిర్వచించడం ఒక్కటే తక్కువ. తతిమ్మా అన్ని కీర్తనలనూ వినిపించారు. చరిత్ర ఉన్నన్ని రోజులూ జగన్ పేరు నిలిచిపోతుందని కూడా పొగిడారు.
అయితే ఆర్.కృష్ణయ్య సెలవిచ్చిన కొన్ని మాటలు బీసీలను భయపెట్టేలా ఉన్నాయి. అసలే తెలంగాణకు చెందిన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలకంటె ఏపీలోనే బీసీల బతుకులు బాగున్నాయని, ఇక్కడ బీసీలకు దక్కవలసిన వాటాకంటె చాలా ఎక్కువగా దక్కుతోందని.. అన్నారు. అంటే.. ఏపీలో బీసీలకు ప్రభుత్వం ఇక చేయాల్సిన మేలు ఏమీ లేదన్నట్టుగా ఆయన చెప్పుకురావడం అందరినీ భయపెడుతోంది. సాధారణంగా ఎక్కడైనా కులసంఘాల సభలు పెడితే.. ప్రభుత్వం తమకు ఏం చేయాలని కోరుకుంటున్నారో తెలియజెప్పడానికి ప్రయత్నిస్తారు. బీసీ నేత ఆర్.కృష్ణయ్య బీసీలకు ఇక ప్రభుత్వం ఏమీ చేయాల్సిన అవసరమే లేదు.. అన్నీ చేసేశారు అన్నట్టుగా మాట్లాడడం చిత్రం.
అదే సమయంలో ఉత్తరాంధ్ర ఇన్చార్జి వైవీ సుబ్బారెడ్ది మాట్లాడుతూ.. జగన్ కు బీసీలంటే అత్యంత ప్రేమ, ఆదరణ ఉన్నాయి గనుకనే.. ఆర్.కృష్ణయ్యను రాజ్యసభకు పంపారని సెలవిచ్చారు. ఈ మాటలపై వైసీపీలోని బీసీ నాయకులు గుర్రుమంటుండడం గమనార్హం. ఆయనకు పదవి ఇచ్చినప్పడే.. వైసీపీలోని బీసీ నాయకులకు తలకొట్టేసినట్టు అయింది. ఏపీ రాష్ట్రంలోని ఏ ఒక్క బీసీ నాయకుడు కూడా రాజ్యసభ పదవికి అర్హుడిగా జగన్ కు కనిపించలేదా.. అని వారు బాధపడ్డారు. బయటకు చెప్పుకోలేకపోయారు. ఇప్పుడు వారి గాయాన్ని మళ్లీ రేపుతున్నట్టుగా ఆర్.కృష్ణయ్య మాట్లాడడం గమనార్హం. ఏపీలో బీసీనాయకులకు గతి లేదన్నట్టుగా జగన్ వ్యవహార సరళి ఉన్నదని, ఇది రాష్ట్రంలోని బీసీలకు చాలా అవమానకరం అని వారు భావిస్తున్నారు.