వలస నేతలకు పెద్దపీట వేస్తున్న చంద్రబాబు

Friday, November 22, 2024

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో గత నాలుగేళ్లుగా టిడిపి శ్రేణులు రాష్త్ర వ్యాప్తంగా ఎన్నో వేధింపులకు గురయ్యారు. దౌర్జన్యాలకు గురయ్యారు. అయినా పార్టీ జెండాను పట్టుకొని, ధైర్యంతో పార్టీ కోసం నిలబడ్డారు. నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లుగా, ఇతరత్రా హోదాలలో పార్టీ మనుగడకోసం ఎంతో కష్టపడ్డారు. పార్టీ నుండి ఒక్కరూపాయి నిధులు లేకపోయినా సొంతంగానే ఆర్ధిక భారాన్ని కూడా మోశారు.

కష్టకాలంలో పార్టీకోసం నిలబడ్డవారిని గుర్తు పెట్టుకుంటానని ఎప్పుడూ చెబుతుంది టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎన్నికలు వచ్చే సరికి వలసనేతలకు పెద్ద పీట వేస్తున్నారని ప్రచారణకు గురవుతున్నారు. గత నాలుగేళ్లుగా పార్టీ కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపకుండా, తమ వ్యాపారాలపై దృష్టి సారిస్తూ, తమ వ్యాపారాలను కాపాడుకుంటూ వస్తున్న నేతలను ఇప్పుడు దగ్గరకు తీస్తున్నారు.

ఒక విధంగా ఇటువంటి చర్యలు పార్టీలో తీవ్రమైన అసంతృప్తికి దారితీస్తుంది. ఈ విషయాన్ని కనిపెట్టలేని పక్షంలో ఎన్నికల సమయంలో పార్టీ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.  వైసిపిలో చెల్లుబాటు కాగా, తిరిగి గెలుపొందే అవకాశం లేదని వారికి తిరిగి సీట్ ఇవ్వరని తెలిసో లేదా వారి ఒంటెత్తు పోకడలతో విసుగు చెందో దూరంగా పెడుతున్న నేతలను దగ్గరకు తీసుకొని, వారికి సీట్లు ఖరారు చేస్తూ టిడిపి శ్రేణులకు ఎటువంటి సందేశం ఇవ్వనున్నారో? అనే ప్రశ్న తలెత్తుతుంది.

టిడిపి పార్టీకి సరైన అభ్యర్థి లేని చోట, పార్టీ బలహీనంగా ఉన్న చోట, వైసిపి నేతలైతే గెలిచే అవకాశాలుంటాయని … అటువంటి వారిని చేర్చుకొని ఆదరించడం అర్థం చేసుకోవచ్చు. కానీ టిడిపికి బలమైన నియోజకవర్గాలలో సహితం వైసిపి నేతలను దగ్గరకు తీసుకొని, సీట్లు ఖరారు చేయడం టిడిపి వర్గాలలో ఆగ్రవేశాలకు దారితీస్తుంది.

ఉదాహరణకు నెల్లూరు జిల్లాలో గత ఎన్నికలలో టిడిపి అన్ని సీట్లలో ఓటమి చెందింది. అందుకు ప్రధాన కారణం చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా ఉంటూ డా. నారాయణ ఆ జిల్లాపై పెత్తనం చేయడమే. ఆయన ఒంటెత్తు పోకడలే పార్టీకి తీరని నష్టం కలిగించాయి. మొదటిసారిగా ఆయన గత ఎన్నికలలో పోటీచేసి ఓటమి చెందారు. ఎన్నికల తర్వాత గత నాలుగేళ్లలో ఆయన ఎక్కడా కనిపించలేదు.

జిల్లాలో మొత్తం సీట్లు కోల్పోయినా నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లుగా ఉన్నవారు వైసిపి నేతల దౌర్జన్యాలను లెక్కచేయకుండా పార్టీ కోసం శ్రమించి పనిచేస్తున్నారు. అటువంటి నాయకులను ఇప్పుడు పక్కన పెడుతున్నారు. ఇప్పుడు నారాయణను నెల్లూరు ఇన్ ఛార్జ్ గా ప్రకటించడం ద్వారా ఆయనను కాబోయే అభ్యర్థిగా ప్రకటించినట్లయింది. అదే విధంగా వైసీపీ నుండి ముగ్గురు ఎమ్యెల్యేలను చేర్చుకొని, వారికి కూడా సీట్లు ఇస్తున్నారు.

అంటే మొత్తం 10 సీట్లు ఉంటె 4 సీట్లలో గత నాలుగేళ్లుగా పార్టీలో కనిపించని వారికి సీట్లు ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రాకపోతే వీరంతా పార్టీ కోసం నిలబడతారని నమ్మకం కూడా లేదు.  అదే విధంగా సత్తెనపల్లి, శ్రీకాళహస్తి వంటి టిడిపికి పట్టుగల నియోజకవర్గాల్లో పార్టీ కోసం పనిచేస్తున్న వారిని కాదని ఇతర పార్టీల వారికి సీట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కొంచెం హుందాగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టం అవుతుంది. అభ్యర్థుల ఆర్హ్తిక వనరులను కాకుండా వారు తనకు, తన పార్టీకి ఏమేరకు విశ్వాసంతో పనిచేస్తారో అనే విషయమే చూస్తున్నారు. తనకు నమ్మకస్తుడనుకొంటే ఆర్ధిక  వనరులు లేకపోయినా అందలం ఎక్కిస్తున్నారు. తిరుపతిలో డా. గురుమూర్తి వంటి ఓ సామాన్య కార్యకర్తను ఎంపీగా చేయడం ఆయనకే చెల్లుబాటయింది.

గతంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఆ విధంగా సామాన్యులను అసామాన్యులుగా తీర్చిదిద్దేవారు. కానీ ఇప్పుడు పార్టీ సీటు కోసం చంద్రబాబు వద్దకు వెళ్లినా, నారా లోకేష్ వద్దకు వెళ్లినా వారడుగుతున్న  మొదటి ప్రశ్న “మీవద్ద ఎంత డబ్బు ఉంది?”. డబ్బు ఉంటె చాలు, వారు ఎన్నికల తర్వాత పార్టీలో ఉంటారనే నమ్మకం లేకపోయినా సీట్లు  ఇవ్వడం పరిపాటిగా మారింది.



Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles