పదేళ్లుగా రాజకీయాలలో తలమునకలవుతున్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాటలలో పరిపక్వత ఉండటంలేదు. సినిమా డైలాగులను తలపించే విధంగా ఆవేశంతో మాట్లాడే మాటలు ఆయన సభలకు వస్తున్న జనాన్ని ఉత్సాహ పరుస్తున్నా రాజకీయంగా చెప్పుకోదగిన ప్రయోజనం కలిగించలేక పోతున్నాయి.
2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రారంభించిన `వారాహి విజయ యాత్ర’ మొదటి దశ అన్నవరం నుండి భీమవరం వరకు పూర్తయింది. ఈ సందర్భంగా అంచనాలకు మించి ఆయన సభలకు జనం వచ్చారు. అయితే వారికి నిర్దుష్టమైన రాజకీయ సందేశం ఇవ్వలేకపోయారని చెప్పవచ్చు.
ఒక రోజు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటారు, మరో రోజు జనాన్ని ఉత్సాహ పరచడం కోసం ఆ విధంగా అన్నాను అంటారు, ఇంకోరోజు ఎమ్యెల్యే కాకుండా ఎవ్వరు ఆపుతారో చూస్తా అంటారు… ఈ విధంగా పొంతనలేని మాటలతో మద్దతుదారులతో గందరగోళం సృష్టిస్తున్నారు. పైగా, రాజకీయ ప్రత్యర్థులపై వాడుతున్న పరుషమైన మాటలు …. తానే చట్టాన్ని చేతిలోకి తీసుకొని కొడతాను అన్నట్లుగా మాట్లాడుతూ పరిణితిగల రాజకీయ వేత్తలుగా జనామోదం పొందలేరు.
ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ ఒక సీటు కూడా గెలవరాదంటూ `వైసిపి ముక్త గోదావరి జిల్లాలు’ అని పిలుపునిచ్చారు. గతంలో చెప్పిన విధంగా వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వను అనే మాట ఇప్పుడు అనడం లేదు. యాత్రలో స్థానికంగా చెప్పుకోదగిన నాయకులు ఎవ్వరిని జనానికి పరిచయం చేసే ప్రయత్నం చేయడం లేదు. తానే పార్టీ అన్నట్లుగా వ్యవహరిస్తే ఎన్నికల్లో పోటీ చేసెడిది ఎవరు? అనే ప్రశ్న వస్తుంది.
ప్రస్తుతంకు `వారాహి యాత్ర’ను గోదావరి జిల్లాలకు పరిమితం చేస్తున్నట్లు కనిపిస్తోంది. మొదటి విడత 10 నియోజకవర్గాల్లో తిరగగా, ఇంకా 24 నియోజకవర్గాలకు వెళ్ళవలసి ఉంది. రెండో విడతగా ఈ నెల 9 నుండి ఏలూరులో యాత్రను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. యాత్రకు ముందు ఈ నెల 6, 7, 8 తేదీల్లో రాజమండ్రిలో పార్టీ నేతలతో పవన్ కల్యాణ్ కీలక చర్చలు జరుపనున్నారు. ఇక్కడైనా ఎన్నికలకు సమాయత్తం అయ్యేందుకు నిర్దుష్టమైన కార్యప్రణాళికను రూపొందించుకోవడం అవసరం కాగలదు.
“ఆవిర్భావం నుంచి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నాను. దశాబ్దకాలంగా ఈ పోరాటాన్ని కొనసాగిస్తోన్నాం. నేను ఎక్కడికి పారిపోవట్లేదు” అంటూ ఆవేశంగా చెబుతున్నా మొత్తం పార్టీని ఏకపాత్రాభినయం వలే నడిపిస్తున్నారు గాని వివిధ స్థాయిలలో నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు జరగడం లేదు. దానితో ఎన్నికల సమయంలో క్షేత్రస్థాయిలో ఓట్లు వేయించుకోవడంకు అవసరమైన యంత్రాంగం సమస్యగా మారే అవకాశం ఉంది.
పలువురు యువ సినీ హీరోల పేర్లను ప్రస్తావిస్తూ వారందరికీ అభిమానినే అని చెప్పడం ద్వారా జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ వంటి నటుల అభిమానుల దృష్టి ఆకర్షించే ప్రయత్నం చేశారు. రాజకీయంగా ఎటువంటి ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది. ఏదేమైనా ఆయన రాజకీయ యాత్ర ఓ సినిమా నటుడి యాత్రనే గుర్తుకు తెస్తుంది గాని రాజకీయ సందేశాలు తన యాత్రలో పెద్దగా ఇవ్వలేక పోతున్నారు.
వైసీపీ మంత్రులు, నేతలు కేవలం పవన్ కళ్యాణ్ ను రెచ్చగొట్టడం కోసమే అదుపుతప్పి ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారు. అంతే ఆవేశంతో పవన్ జవాబు ఇచ్చే ప్రయత్నం చేస్తే వారి ఊబిలో చిక్కుకున్నట్లు కాగలదు. వారి ఎత్తుగడలను తెలుసుకోగలగాలి.
`వారాహి యాత్ర’లో లభిస్తున్న ప్రజా మద్దతును రాజకీయ మద్దతుగా మలచుకోవడం నేడు పవన్ కళ్యాణ్ ముందున్న పెద్ద సవాల్. అందుకోసం వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సి ఉంది. జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో ప్రజలకు చేరువకాగల నాయకులను ప్రోత్సహించాల్సి ఉంది. అందుకు పెద్ద ఎత్తునే కసరత్తు జరగాలి.