‘ప్రయోజనం అనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే’ అనం సంస్కృతంలో ఒక సుభాషితం ఉంటుంది. ఈ ప్రపంచంలో, ప్రయోజనం ఆశించకుండా ఏ ఒక్కరూ కూడా ఏ ఒక్క పనీ చేయరు గాక చేయరు.. అనేది ఈ మంచిమాట భావం. ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిని వెనకేసుకు రావడానికి ప్రయత్నించిన ముద్రగడ పద్మనాభం విషయంలో అందరూ అనుకుంటున్నది అదే. నిజానికి ముద్రగడ పద్మనాభం తనకు సంబంధం లేని వ్యవహారంలో తలదూర్చారు. పవన్ కల్యాణ్ తన వారాహి యాత్రలో భాగంగా, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి మీద విమర్శలు చేశారు. ఆయన వాటికి సమాధానాలు ఇచ్చారు. సవాళ్లు విసిరారు. వారిద్దరి మధ్య వ్యవహారం బహుశా అక్కడితో సమసిపోయి ఉండేది. కానీ తగుదునమ్మా అంటూ ముద్రగడ పద్మనాభం తలదూర్చారు. ద్వారంపూడి ఫ్యామిలీ మొత్తాన్ని వెనకేసుకువచ్చారు. ఆయన తండ్రి, తాత కూడా మహనీయులు అంటూ వారిని నిందించడం తగదని పవన్ కు బుద్ధి చెప్పారు. అక్కడితో ఆగకుండా.. పవన్ కల్యాణ్ తొలినుంచి సాగిస్తున్న మొత్తం రాజకీయ ప్రస్థానాన్ని విమర్శిస్తూ.. సుదీర్ఘమైన లేఖ రాసి వివాదంలో ఆజ్యంపోశారు. కాపు ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ద్వారంపూడి తనకు ఎంతో సాయం చేశారని అంటూ.. ముద్రగడ కాపులందరూ ద్వారంపూడిని అభిమానించాలనేలా మరికొన్ని మాటలు కూడా వదిలారు. ఇవి కాపులను రెచ్చగొట్టాయి. అక్కడికేదో.. కాపులకు గతిలేక ద్వారంపూడి సాయం అందుకున్నట్టుగా అర్థం వచ్చింది. దీనిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని కాపు నాయకులే తీవ్రంగా నిరసించారు. మరోవైపు ఉభయగోదావరి జిల్లాల్లో సంఖ్యాపరంగా పుష్కలంగా ఉండే.. కాపులు ముద్రగడ మీద విరుచుకుపడడం మొదలైంది. హరిరామజోగయ్య , పవన్ కల్యాణ్ కు అనుకూలంగా ఉండడం వింత కాదు గానీ.. ఇతర వైసీపీ కాపులు కూడా ముద్రగడను విమర్శించడం ప్రారంభించారు.
ఇక్కడే వైసీపీలో పునరాలోచన మొదలైంది. ముద్రగడ వ్యాఖ్యలకు తాము మద్దతివ్వడం వలన.. కాపు కులంలో తమ పార్టీ ఇమేజి దెబ్బతింటుందని వారు భయపడే పరిస్థితి వచ్చింది. ముద్రగడ పద్మనాభం ఎన్నికల సమయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి, పిఠాపురం టికెట్ తీసుకునేలా ముందస్తు ఆలోచన లేదా వ్యూహంతోనే పవన్ మీద విరుచుకుపడ్డారనే గుసగుసలు ఉన్నాయి. అందుకే తొలుత వైసీపీ సుముఖత వ్యక్తం చేసిందని అనుకుంటున్నారు. ఆ నమ్మకంతోనే.. ద్వారంపూడి మీద పోటీచేసే ధైర్యం లేకపోతే పిఠాపురం లో తనమీద పోటీచేసి దమ్ముంటే గెలవాలని ముద్రగడ , పవన్ కల్యాణ్ కు సవాలు విసిరారు. అయితే ఇప్పుడు రెండు జిల్లాల్లోని కాపులంతా ముద్రగడను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.,. ఆయనను గనుక తమ పార్టీలో చేర్చుకుంటే.. తామే పనిగట్టుకుని కుట్రపూరితంగా పవన్ మీద విమర్శలు చేయించినట్లుగా కనిపిస్తుందని వైసీపీ భయపడుతోంది. అందుకే ముద్రగడకు వైఎస్సార్ కాంగ్రెస్ డోర్స్ క్లోజ్ చేసినట్లుగా రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. పాపం ముద్రగడ.. ఏదో ఆశించి ఏదో చేయబోయారు గానీ.. ఆయన కోరుకున్నట్టుగా రాజకీయ భవిష్యత్తు ముందుకు సాగేలా లేదని పలువురు భావిస్తున్నారు.