ఏపీలో కాంగ్రెస్ ప్రచారంకు షర్మిల విముఖత!

Thursday, May 16, 2024

వైఎస్సాఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ తో కలిసి పనిచేసే విషయమై వేగంగా పరిణామాలు జరుగుతున్నాయి. ఈ విషయమై కాంగ్రెస్ అధిష్టానంతోనే తేల్చుకునేందుకు ఆమె స్వయంగా ఢిల్లీకి వెళ్ళబోతున్నారని ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీని కూడా కలుస్తారని చెబుతున్నారు.

షర్మిలతో తమ పార్టీ నేతలు టచ్ లో ఉన్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జీ మాణిక్‌రావు థాక్రే ప్రకటించడంతో ఈ విషయమై కాంగ్రెస్ నాయకత్వం కూడా సుముఖంగా ఉన్నట్లు స్పష్టం అవుతుంది. అయితే కాంగ్రెస్ నేతలు ఆమె పార్టీలో చేరడం వల్లన ఏపీలో కాంగ్రెస్ ను పునర్జీవింపచేయడం సాధ్యం అవుతుందని వాఖ్యలు చేస్తున్నారు.

అక్కడ ఆమె అన్న, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఒంటి, బిజేపికి సన్నిహితంగా వ్యవహరిస్తుండడంతో  షర్మిలను ఉపయోగించి జగన్ ను దెబ్బతీయడం కాంగ్రెస్ వారి ఎత్తుగడగా కనిపిస్తుంది. అయితే ఈ విషయంలో షర్మిల స్పష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది.  తాను తెలంగాణకే పరిమితం అవుతానని ఆమె తేల్చి చెప్పారు.

ఇప్పటివరకు అన్న జగన్ కు వ్యతిరేకంగా ఆమె ఎటువంటి వాఖ్యలు చేయలేదు. అందుకనే ఏపీలో అన్నకు వ్యతిరేకంగా రాజకీయ ప్రచారంలో పాల్గొనే ప్రసక్తి లేదని ఆమె సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. ఈ విషయాన్నే కాంగ్రెస్ అగ్రనాయకుల వద్ద సహితం స్పష్టం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది.

అయితే, తెలంగాణాలో ఆమె సేవల విషయంలో కాంగ్రెస్ నేతలు పెదవి విరుస్తున్నారు. ఆమెకే కాకుండా, తన మద్దతుదారులకు కూడా కాంగ్రెస్ సీట్లు ఇవ్వాలని ఆమె కోరుతూ ఉండటంతో విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఆమె కాంగ్రెస్ లో చేరడం వల్లన తెలంగాణాలో కాంగ్రెస్ కు ఎటువంటి ప్రయోజనం ఉండబోదని తేల్చి చెబుతున్నారు.

అయితే, ఇప్పటికే ఈ విషయమై ఆమెతో మాట్లాడిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాత్రం  ప్రస్తుతానికి తెలంగాణ వరకు ఆమెను తీసుకు వచ్చి, తెలంగాణ ఎన్నికల తర్వాత చూడవచ్చులే అని చెబుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సోనియా గాంధీ సహితం వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తెగా ఆమెకు తగు ప్రాధాన్యత ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం ఆమె తన వైఎస్‌ఆర్‌టిపిని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారా? లేక కేవలం పొత్తు పెట్టుకుంటారా? అనేది తేలాల్సి ఉంది. ఈ విషయమై ఆమె ఢిల్లీ పర్యటనలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ తో కలిసి పని చేయడంపై షర్మిల కొన్ని షరతులు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. టీపీసీసీలో కీలక బాధ్యతలు ఇవ్వాలని, తాను పాలేరు నుంచి పోటీ చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో తను కోరిన వారికి సీట్ల కేటాయింపుపై భరోసా ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఇక ఏపీ రాజకీయాల్లో తాను ఇన్వాల్వ్ కాబోనని, తెలంగాణకే పరిమితమవుతానని స్పష్టం చేసినట్లు నేతలు చెబుతున్నారు. ఈ అంశాలపై కాంగ్రెస్ పార్టీ నుండి స్పష్టత ఏర్పడితే గాని ఆమె రాహుల్ గాంధీని లేదా ప్రియాంక గాంధీని కలిసి, కాంగ్రెస్ లో చేరే విషయమై ప్రకటన చేసే అవకాశం లేదు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles