మరోసారి మద్యం కుంభకోణంలో కవిత పేరు!

Saturday, November 16, 2024

ఢిల్లీ మద్యం కుంభకోణంలో బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవిత కీలక సూత్రధారి అని, ఆమెను త్వరలో అరెస్ట్ చేయబోతున్నారని తెలంగాణాలో బిజెపి నేతలు నిత్యం చెబుతుంటారు. ఢిల్లీలో కేంద్ర దర్యాప్తు సంస్థలు తరచూ కోర్టులో ఆమె పేరును ప్రస్తావిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు ఆమెను విచారణ కూడా చేశారు. అయితే ఇప్పటివరకు ఆమెను నిందితురాలిగా పేర్కొనలేదు.

మరోవంక, మూడు రోజులక్రితం సిబిఐ దాఖలు చేసిన అదనపు ఛార్జ్ షీట్ లో ఆమె పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. కనీసం సిబిఐ ఈ కేసులో ఇప్పటివరకు విచారించిన వారి పేర్ల జాబితాలో కూడా ఆమె పేరు లేదు. అంటే ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చారా? అనే ప్రశ్న తలెత్తింది. కానీ, తాజాగా మంగళవారం కోర్టులో ఈడీ ఆమె పేరును ప్రస్తావించింది. ఇదంతా చూస్తుంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు కవిత విషయంలో దొంగాట ఆడుతున్నాయా? అనే అనుమానం కలుగుతుంది.

ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరును ప్రముఖంగా ప్రస్తావించారు. అయితే, లిక్కర్ స్కాంలో నిందితుడిగా ఉన్న అరుణ్ రామచంద్ర పిళ్లయ్ కవితకు ప్రతినిధిగా ఉన్నారని, ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఒప్పుకున్నారని ఈడీ తరఫు న్యాయవాది రౌస్ ఎవెన్యూ కోర్టుకు విన్నవించారు.

278 పేజీల సప్లిమెంటరీ చార్జ్ షీట్‌‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ 53 సార్లు ప్రస్తావించింది. సౌత్ గ్రూప్‌‌లో ఆమె పాత్ర, నిందితులు అరుణ్ రామ చంద్ర పిళ్లై, బుచ్చిబాబు, సమీర్ మహేంద్రు, మాగుంట రాఘవ, శరత్ చంద్రా రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, దినేశ్‌‌ అరోరాతో ఉన్న  సంబంధాలను వారి స్టేట్‌‌మెంట్ల రూపంలో  ప్రస్తావించింది.

ఇండోస్పిరిట్ వాటాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే అసలైన పెట్టుబడిదారు అని అరుణ్ పిళ్లై అంగీకరించినట్లు ఎన్ ఫోర్స్‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వెల్లడించింది. లిక్కర్ పాలసీలో కవిత, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య ఒప్పందం, అవగాహన ఉందని పిళ్లై, బుచ్చి బాబు స్టేట్‌‌మెంట్లు ఇచ్చినట్లు తెలిపింది.

అరుణ్‌ రామచంద్ర పిళ్లై బెయిల్ పిటిషన్‌పై మంగళవారం రౌస్ ఎవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈడీ న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ… ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించారు. ఈ స్కామ్ సంబంధించిన సమావేశాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఈ స్కామ్ ద్వారా వచ్చిన డబ్బులతో కవిత ఫీనిక్స్ అనే కంపెనీ నుంచి భూములు కొనుగోలు చేశారని ఈడీ అభియోగించింది.

అరుణ్ పిళ్లై సౌత్ గ్రూప్‌లో కీలక వ్యక్తి అని పేర్కొంటూ కవితకు సంబంధించిన వ్యక్తిగా అరుణ్ పిళ్లై వ్యవహరించారని ఈడీ తెలిపింది. ఈ స్కామ్ లో వచ్చిన లాభాలతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు అభియోగించింది. ఫీనిక్స్ సంస్థ నుంచి కవిత భర్త అనిల్, బుచ్చిబాబులు భూములు కొనుగోలు చేశారని కౌంటర్ ఛార్జ్ షీట్ లో తెలిపింది.

అయితే దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ ఇటీవల దాఖలు చేసిన రెండో ఛార్జ్ షీట్ ఎమ్మెల్సీ కవిత పేరు లేదు. ఏప్రిల్‌ 25న అనుబంధ ఛార్జ్‌షీట్‌ను సీబీఐ దాఖలు చేసింది. గత ఏడాది డిసెంబర్‌ 11న కవితను హైదరాబాద్‌లో సీబీఐ ప్రశ్నించింది. ఇప్పటిదాకా ప్రశ్నించిన 89 మంది వివరాలను సీబీఐ ఛార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది.

సీబీఐ ఛార్జి షీట్ లో కవిత పేరును ప్రస్తావించకపోయినా  ఈడీ కౌంటర్ పిటిషన్ మాత్రం కవిత పేరును తరచూ ప్రస్తావిస్తుంది. మే 4న మరో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది ఈడీ. సుమారు 2 వేల అనుబంధ పేజీలతో నాలుగో అదనపు ఛార్జ్‌షీట్‌ వేసింది. ఈ ఛార్జ్‌షీట్లలో ప్రధానంగా మనీష్‌ సిసోడియాపైనే దర్యాప్తు సంస్థలు అభియోగాలు నమోదు చేశాయి.

ఇప్పటికి మూడు సార్లు కవితను ఈడీ ప్రశ్నించింది. కవిత పేరు పలుసార్లు ప్రస్తావించినప్పటికీ ఈడీ ప్రశ్నించిన వారి జాబితాలో కవిత పేరు లేదని తెలుస్తోంది. కవిత బినామీ రామచంద్ర పిళ్లై అని ఈడీ బలంగా వాదిస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles