పోయినోళ్ళంతా పార్టీలోకి వచ్చేయమని రేవంత్ ఆహ్వానం

Friday, November 22, 2024

కర్ణాటక లో కాంగ్రెస్ గెలుపుతో మంచి జోష్ మీదున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు సహితం మరో ఐదారు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కూడా పాగా వేసేందుకు ఉత్సాహంతో ముందడుగు వేస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ను వదిలి బీజేపీలో చేరిన నేతలంతా  తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేయమని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ ఆహ్వానం పలికారు.

గత ఏడాది ఎమ్యెల్యే పదవికి, కాంగ్రెస్ కు రాజీనామా చేసి, ఉపఎన్నికలో ఓటమి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేవంత్ క్షమాపణ చెబితే తిరిగి కాంగ్రెస్ లో చేరే విషయం ఆలోచిస్తానని అన్నట్లు వచ్చిన కథనాలపై స్పందిస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎన్ని మెట్లు దిగటానికి అయినా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.

కన్నతల్లి లాంటి పార్టీని వీడి వెళ్లినవారు.. తిరిగి పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు రేవంత్. పార్టీ నుంచి వెళ్లిన వివేక్ వెంకటస్వామి, రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డితోపాటు ఈటెల రాజేందర్ వంటి ఇతర నేతలు అందరూ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. అదే విధంగా బిఆర్ఎస్ నుండి సస్పెండ్ అయి ఏ పార్టీలో చేరాలో ఆలోచిస్తున్న వారికి కూడా కాంగ్రెస్ లో చేరమని ఆహ్వానం పలికారు.

అయితే, తాను కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని రాజగోపాల్ రెడ్డి ఖండించారు. ఆ వార్తలను ఎవరూనమ్మొద్దని  కోరుతూ బిజెపిలోనే తాను కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. “కర్ణాటక ఫలితాలు చూసి కాంగ్రెస్‌లోకి మళ్లీ రావాలని నా మిత్రులు అడుగుతున్నారు. నేను బిజెపిని వీడుతున్నట్లు కొన్ని తప్పుడు వార్తలు వస్తున్నాయి” అంటూ వివరణ ఇచ్చారు.

వివేక్‌, కొండా విశ్వేశ్వర రెడ్డి, రాజగోపాల్‌ రెడ్డి, ఈటల, జూపల్లి, పొంగులేటి లాంటి నేతలకు బీజేపీ సిద్ధాంతాలతో వారికి ఏ మాత్రం సంబంధం లేదని, క్షణికావేశంలో బీజేపీలో చేరారని రేవంత్ స్పష్టం తెలిపారు. అయితే కేసీఆర్ ను ఓడించాలని బలంగా కోరుకుంటున్న వీరంతా తిరిగి కాంగ్రెస్ గూటికి రావాలని కోరారు.

” కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణా రావు అందరూ కాంగ్రెస్ పార్టీ లోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటిది, ఒక్కోసారి తల్లితండ్రులను కాదని ప్రేమించిన వాడితో లేచిపోతాం. తిరిగి ఏం మొహం పెట్టుకొని ఇంటికి పోతాం అని వాడు కొట్టినా, సిగరెట్ తో కాల్చినా బాధ భరిస్తాం. మీలాంటి వారిని తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ తిరిగి చేర్చుకోవాలని ఉంటుంది” అని చెప్పారు.

“నాతో ఏమైనా ఇబ్బంది ఉంటే అధిష్టానంతో మాట్లాడి పార్టీలోకి రావొచ్చు” అంటూ రేవంత్ రెడ్డి వారికి సూచించారు. కేసీఆర్ వ్యతిరేక శక్తుల పునరేకీకరణ జరగాలని స్పష్టం చేస్తూ ఇందుకోసం పీసీసీ చీఫ్ గా తనను ఎవరేమన్నా భరిస్తానని రేవంత్ చెప్పారు.

బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే

కాగా, బీజేపీ, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని మరో మారు రుజువైందని రేవంత్ ఆరోపించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడాన్ని సీఎం కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారని చెబుతూ మొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్ మాట్లాడిన మాటలే నిన్న  కేసీఆర్ నోటి నుంచి వచ్చాయని స్పష్టం చేశారు. కేసీఆర్ బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ లో కర్నాటక లో కాంగ్రెస్ విజయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదనడాన్ని రేవంత్ తప్పు పట్టారు.

 బీజేపీ ప్రభుత్వంపై కేసీఆర్ పోరాటం నిజమే అయితే కాంగ్రెస్ విజయాన్ని అభినందించేవారని చెప్పారు.  కర్ణాటక జేడీఎస్ కు లక్షల కోట్ల రూపాయలు పంపి కాంగ్రెస్ ను ఓడించాలని కేసీఆర్ కుట్ర చేశారని రేవంత్ ఆరోపించారు. హంగ్ ఏర్పడితే తానే కింగ్ మేకర్ అవుదామనుకొన్న కేసీఆర్  బొక్క బోర్లా పడ్డారని ఎద్దేవా చేశారు. కర్ణాటక ఫలితాల తర్వాత దేశంలో మోదీ  బ్రాండ్ కు గ్రాఫ్ పడిపోయిందని రుజువైందని చెప్పారు.

కర్నాటకలో బీజేపీ ప్రభుత్వం 40 శాతం కమీషన్ల మీద పనిచేసిందని అంటూ ఇక్కడ కేసీఆర్ సర్కారు 30శాతం కమీషన్ల కోసం పనిచేస్తున్నదని రేవంత్ ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలను చీల్చడం, కాంట్రాక్టర్లకు టెండర్లు ఇవ్వడం ద్వారా కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కర్నాటకలో ఓటమిని బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీల ఓటమిగా చూడాలని హితవు చెప్పారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీ గర్జన నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles