ఆరోగ్యశ్రీ సేవలు నిలిపి వేస్తామనడంతో ఖంగారులో జగన్ ప్రభుత్వం

Thursday, May 2, 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా అందుతున్న ఆరోగ్య శ్రీ సేవలు శుక్రవారం నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం ద్వారా గురువారం వైఎస్ జగన్ ప్రభుత్వంకు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు షాక్ ఇచ్చాయి. ఆర్ధిక సమస్యలతో అన్ని బిల్లులను ఆపేస్తున్న ప్రభుత్వం వారి ప్రకటనతో హడావుడిగా నష్టనివారణ చర్యలు చేపట్టింది.

ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు పెద్ద మొత్తంలో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు వెల్లడించారు. బకాయిల విడుదల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సేవలు నిలిపివేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఏఎస్‌హెచ్ఏ) వెల్లడించింది.

గతంలో మే 1వ తేదీ నుంచి వైద్య సేవలు నిలిపివేయాలని నిర్ణయించగా.. ఈ నెల రూ. 200 కోట్లు బకాయిల నిమిత్తం ప్రభుత్వం విడుదల చేసింది. అయితే, ఆరోగ్యశ్రీ కింద నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు దాదాపు రూ. 2 వేల కోట్లకుపైగా ప్రభుత్వం బకాయి పడినట్లు తెలుస్తోంది. ఈ బకాయిల కారణంగా ఆరోగ్య శ్రీ కింద సేవలు అందించలేమని నెట్‌వర్క్‌ ఆస్పత్రులు స్పష్టం చేశాయి.

కేంద్రం నుంచి ఆయుష్మాన్ భారత్ కింద వచ్చిన నిధులను రాష్ట్ర సర్కార మెడికల్ కళాశాలల నిర్మాణానికి మళ్లించింది. దీంతో ఆయుష్మాన్ భారత్ కింద నిధులను కేంద్రం నిలిపివేసింది. పేద రోగులకు భరోసా కల్పిస్తున్న అద్భుతమైన పథకం ఆరోగ్యశ్రీ. ఈ పథకాన్ని దివంగత నేత, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టారు.

ఆయన ప్రారంభించిన ఈ పథకాన్ని తర్వాత ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ కొనసాగుతుంది. ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంతో మంది పేద కుటుంబాల వారు ఉచితంగా చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ఏపీ ఆసుపత్రుల అసోసియేషన్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోకి లేఖ ద్వారా తెలియజేసింది.

బకాయిల విడుదల విషయంలో ఏపీ సర్కార్ ఇచ్చిన హామీని నెరవేర్చిన పోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈసేవలు నిలిపి వేస్తున్నట్టు ఆస్పత్రుల అసోసియేషన్ తెలిపింది. బకాయిలు రాకపోవడంతో సేవలు నిలిపివేయాలని జిల్లాల వారీగా ఏకగ్రీవ తీర్మానానికి ప్రైవేట్‌ ఆస్పత్రులు ఆమోదం తెలిపాయి.

మరోవైపు నెట్‌వర్క్ ఆసుపత్రులు సేవలు నిలిపివేస్తున్నారని సమాచారం తెలియడంతో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కలవరపడుతున్నారు. ఆరోగ్య శ్రీ నుంచి ఆసుపత్రుల యాజమాన్యాలకు మెసేజ్‌లు పంపుతూ, త్వరలో నిధులు సర్దుబాటు చేస్తామని ట్రస్ట్ అధికారులు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ సేవలు యధావిధిగా ఆకొనసాగుతాయని ట్రస్ట్ సీఈఓ హరేంద్ర ప్రసాద్ ప్రకటించారు. గురువారం నెట్ వర్క్ ఆసుపత్రులకు రూ 368 కోట్ల బిల్లులు చెల్లించినట్లు తెలిపారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles