ఈ ఏడాది చివరిలో జరుగనున్న తెలంగాణ ఎన్నికలకు సరిగ్గా ఆరు నెలల ముందు పొరుగున ఉన్న కర్ణాటకలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కలవరం చెందుతున్నట్లు తెలుస్తున్నది. అక్కడి ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉన్నప్పటికీ తెలంగాణపై వాటి ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
జాతీయ పార్టీగా బిఆర్ఎస్ ను ప్రకటించగానే మొదటగా కర్ణాటక ఎన్నికలలో తమ జాతీయ రాజకీయ యాత్ర ప్రారంభం అవుతుందని ప్రకటించిన కేసీఆర్ తీరా ఎన్నికలు ప్రకటించేసరికి మౌనం వహిస్తున్నారు. కనీసం కర్ణాటక నుండి బిఆర్ఎస్ లో ఎవ్వరిని చేర్చుకొంటున్నట్లు కూడా కనబడటం లేదు. అక్కడి జెడిఎస్ తో కలసి పొత్తులు పెట్టుకొని, ఉమ్మడిగా ప్రచారం చేస్తామని చెప్పిన ఆయన ఇప్పుడు ఆ ప్రస్తావన తేవడం లేదు.
గతంలో మాదిరిగా హ్యాంగ్ అసెంబ్లీ ఏర్పడి, ప్రభుత్వం ఏర్పాటులో జేడీఎస్ కింగ్ మేకర్ కాగలిగితే కేసీఆర్ కొంతవరకు ఊపిరి పీల్చుకొనే అవకాశం ఉంటుంది. ఆ విధంగా కాకుండా బిజెపి, కాంగ్రెస్ లలో ఏ పార్టీ పూర్తి మెజారిటీ తెచ్చుకొని, ప్రభుత్వం ఏర్పాటు చేసినా – ఆ పార్టీ తెలంగాణా ఎన్నికలలో బలమైన పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే, కర్ణాటకలో గెలుపుపై దృష్టి సారిస్తున్న అదే సమయంలో తెలంగాణలో ఏ విధంగా గెలవాలనే దానిపై ప్రధాని మోదీ, అమిత్ షా కసరత్తు చేస్తూనే ఉన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత దక్షిణాదిన తెలంగాణపైననే దృష్టి సారిస్తామని చెబుతున్నారు. కర్ణాటకలో తిరిగి బిజెపి ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణాలో బిజెపి శ్రేణులలో నూతన ఉత్సాహం నింపే అవకాశం ఉంది.
కర్ణాటకలో తమకు గెలుపు అవకాశాలు ఉన్నాయని బలంగా నమ్ముతున్న కాంగ్రెస్, అక్కడ గెలుపొంది ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దానై ప్రభావంతో తెలంగాణలోనూ తమకు అధికారంలోకి రాగలమనే భరోసా కాంగ్రెస్ నేతలలో కనిపిస్తున్నది. ముఖ్యంగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఏఐసీసీలో గట్టి మద్దతుదారునిగా ఉంటున్న కేపీసీసీ అధ్యక్షుడు శివకుమార్ తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం కోసం ముమ్మరంగా వనరులు సమకూర్చే అవకాశం కూడా ఉంది.
అందుకనే కర్ణాటక ఎన్నికల సరళిని కేసీఆర్ నిశితంగా గమనిస్తున్నారని చెబుతున్నారు. అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని అక్కడి ప్రజల మూడ్ ను అధ్యయనం చేస్తున్నారు. కర్ణాటక పరిణామాలకు తగ్గట్టుగా తెలంగాణాలో బిఆర్ఎస్ ఎన్నికల వ్యూహంలో మార్పులు, చేర్పులు చేసుకొనేందుకు సిద్ధమవుతున్నారు.