మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టులో రామోజీరావుకు చుక్కెదురు

Thursday, May 2, 2024

తాము ఎదుటివారిని ప్రశ్నించడమే గాని, చట్టం తమను ఏమీ చేయలేదనే ధీమాతో సుదీర్ఘకాలంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని అనూహ్యంగా విస్తరింపచేసుకొంటూ వస్తున్న ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావుకు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ వ్యవహారంలో బహుశా మొదటిసారి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. మార్గదర్శి డిపాజిట్లు, ఇతర ఆర్ధిక కార్యకలాపాల వివరాలను తెలపాల్సిందే అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.

డా. వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు 17 సంవత్సరాల అనంతరం ఇప్పుడు కీలక ఆదేశాలు జారీ చేసింది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో డిపాజిట్ల వివరాలను వెల్లడించాలని ఆదేశించింది.

డిపాజిట్ దారులకు చెల్లింపులు చేశామన్న మార్గదర్శి తరపు వాదనలపై ఉండవల్లి అభ్యంతరం వ్యక్తం చేశారు. చెల్లింపులు చేశాక డిపాజిటర్ల సమాచారం బయట పెట్టడానికి ఇబ్బంది ఏమిటని ఉండవల్లి నిలదీశారు. ఉండవల్లి వాదనతో ఏకీభవించిన సుప్రీం కోర్టు డిపాజిట్ల వివరాలను బయట పెట్టాలని ఆదేశించింది.

ఇప్పటి వరకు తమపై చిట్ లో పెట్టుబడులు పెట్టినవారెవ్వరు ఫిర్యాదులు చేయడం లేదని, మిగిలిన వారికి వివరాలు ఎందుకంటూ సమాధానాలు దాటవేస్తూ వస్తున్నారు. అయితే, చట్టం ప్రకారం తమ ఆర్ధిక కార్యకలాపాలు జరుగుతున్నాయా? లేదా? అనే ప్రశ్నకు సమాధానం చెప్పకుండా తప్పించుకోగలుగు తున్నారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశం ఇబ్బందికర పరిస్థితికి దారితీసే అవకాశం ఉంది.

మార్గదర్శిలో పెట్టుబడులు ఎంత మేరకు ఉన్నాయి? చెల్లింపులు ఎంత ఉన్నాయనే సంగతి తేల్చాలని ఆదేశించింది. వివరాలు బయట పెట్టడంలో రహస్యం ఎందుకని ధర్మాసనం మార్గదర్శి సంస్థను ప్రశ్నించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్‌ జే.బీ.పర్డీవాలా నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.

మార్గదర్శి సంస్థను హిందూ అన్‌ డివైడెడ్ ఫ్యామిలీ అని చెబుతూనే మరోవైపు ప్రొప్రైటరీ కన్సర్న్ అని చెప్పడంపై న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది. డిపాజిట్ దారులందరికి చెల్లింపులుచేశామని మార్గదర్శి న్యాయవాది తెలుపగా, చెల్లింపులు జరిపిన తర్వాత వివరాలను బయట పెట్టడానికి అభ్యంతరం ఎందుకని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించడంతో పిటిషనర్ వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవించింది.

కొన్నేళ్లుగా డిపాజిట్ల వివరాలు బయటపెట్టకుండా ఎందుకు దాస్తున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. రూ.2600 కోట్ల డిపాజిట్లు ఎక్కడి నుంచి వచ్చాయని, డిపాజిట్లను ఎంత మందికి తిరిగి చెల్లించారని, చెక్కుల రూపంలో ఇచ్చారా? మరో రూపంలో ఇచ్చారా? అని సుప్రీం కోర్టు నిలదీసింది.

డిపాజిటర్ల వివరాలను కోర్టుకు అందజేయాలని తేల్చి చెప్పింది.  సుప్రీం కోర్టు ఉత్తర్వులు నేపథ్యంలో మార్గదర్శిపై 17 ఏళ్ల న్యాయ పోరాటంలో కీలక మలుపు చోటుచేసుకుందని మాజీ ఎంపీ, సీనియర్‌ న్యాయవాది ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ సంతోషం వ్యక్తం చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles