తెలంగాణ హైకోర్టు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి నెల 25వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని సీబీఐని కోర్టు ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అరెస్ట్ తప్పదని అనుకొంటున్న సమయంలో కొంత ఊరట లభించినట్లయింది.
అయితే అవినాష్ రెడ్డికి విచారణకు సిబిఐ నోటీసులు వచ్చినప్పుడల్లా, ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అనే భయంతో వెంటనే ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాలను కలిసి వస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ పర్యాయం తాడేపల్లి ప్యాలెస్ దాటి వెళ్ళాక పోవడం పలువురికి విస్మయం కలిగిస్తోంది.
అవినాష్ తండ్రి, బాబాయ్ వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిబిఐ తదుపరి అవినాష్ ను అరెస్ట్ చేయబోతున్నట్లు హైకోర్టుకు తెలపడం గమనార్హం. వెంటనే ఢిల్లీకి వైఎస్ జగన్ బయలుదేరబోతున్నల్టు కధనాలు వచ్చాయి. అయితే, ఢిల్లీ నుండి అంతగా సానుకూల సంకేతాలు రాకపోవడంతో ఆయన ఢిల్లీ బయలుదేరలేదని చెబుతున్నారు.
కారణాలు ఏమైనా, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో జోక్యం చేసుకోవడానికి ఢిల్లీలోని బిజెపి అగ్రనేతలు జగన్ కు మొహం చాటేస్తున్నట్లు కనిపిస్తున్నది. అటు ప్రధనమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాలు కూడా పట్టించుకోవడంలేదని తెలుస్తున్నది.
అవినాష్ రెడ్డికి అరెస్ట్ ముప్పు ఏర్పడటంతో సీఎం జగన్ ఢిల్లీకి బయలుదేరాలనుకున్నారని, అయితే అక్కడ ఎవ్వరి అపాయింట్‌మెంట్ లభించకపోవడంతో ఏమీచేయలేక పోతున్నారని చెబుతున్నారు. కర్నాటక ఎన్నికల్లో బిజీగా ఉన్నామని బీజేపీ అగ్రనేతలు తప్పించుకుంటున్నారని తెలుస్తున్నది.
వాస్తవానికి కర్ణాటకలో ప్రస్తుతం కీలకమైన నామినేషన్ల ఘట్టంలో అక్కడి నాయకులూ తీరిక లేకుండా ఉండడంతో ఇంకా ప్రచారం ప్రారంభం కాలేదు. ఢిల్లీపైనే గంపెడాశలు పెట్టుకున్న సీఎం జగన్ ప్రధాని మోదీ, అమిత్ షాల అపాయింట్ మెంట్ల కోసం శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వారి అపాయింట్‌మెంట్లు లభిస్తే ఏ నిమిషంలోనైనా జగన్ ఢిల్లీకి రావాలనుకుంటున్నారని చెబుతున్నారు.
పైగా, కర్ణాటక ఎన్నికలలో వైఎస్ జగన్ సహాయం కూడా బిజెపి నేతలు ఆశిస్తున్నారు. అయినప్పటికీ ఈ విషయంలో దూరంగా ఉండే ప్రయత్నం చేస్తుండానికి ప్రధానంగా రెండు కారణాలు తెలుస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీలో ఉన్న మాజీ టీడీపీ ఎంపీలు సీఎం రమేష్, సుజనా చౌదరీలు ఢిల్లీలో జగన్ కు వ్యతిరేకంగా పార్టీ అధిష్ఠానం వద్ద తమ పలుకుబడిని ఉపయోగిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
మరొకటి, వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డిని జగన్ ఈ మధ్య దూరంగా పెడుతుండటంతో ఢిల్లీలో జగన్ కు సరికొత్త సమస్యలు ఎదురవుతున్నట్లు స్పష్టం అవుతుంది. పిఎంఓ కు కూడా నేరుగా వెళ్లి, పనులు చక్కబెట్టగల సామర్థ్యం సంపాదించుకున్న విజయసాయిరెడ్డి రీతిలో ఢిల్లీలో వ్యవహారాలు చక్కదిద్దగల వారెవ్వరూ ఇప్పుడు వైసీపీలో లేన్నట్లు వెల్లడి అవుతుంది.