కేసీఆర్ ఉక్కు బీడ్ తో ఇరకాటంలో జగన్!

Friday, November 22, 2024

విశాఖ ఉక్కుపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అధికారుల బృందాన్నిపంపడం ద్వారా దానిని ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకొనేందుకు పట్టుదలగా ఉన్నామనే సంకేతాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ కొనుగోలు కోసం తెలంగాణ ప్రభుత్వం తరపున బిడ్ వేయడం ద్వారా మోదీ ప్రభుత్వ రంగ సంస్థలను కారుచవకగా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నాలను అడ్డుకొంటున్న నేతగా జాతీయస్థాయిలో గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వ రంగ సంస్థలను ఏవిధంగా కాపాడుకోవచ్చనేది జాతీయ స్థాయిలో చాటిచెప్తూ.. బీజేపీ సవాల్ విసిరేందుకు సిద్ధమవుతున్నారు.

అయితే, కేసీఆర్ ప్రయత్నాలు కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం చూపుతాయో గాని ఏపీలో కేసీఆర్ కు మిత్రుడిగా భావిస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని మాత్రం ఇరకాటంలో పడవేసి అవకాశం కనిపిస్తున్నది.

ఈ చర్య ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో పాటు ఏపీలో బీఆర్ఎస్‌కు సానుకూలతలు తీసుకురావడం కేసీఆర్ వ్యూహంగా చెబుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఏ విధంగా కాపాడుకోవచ్చనే అంశాన్ని జాతీయస్థాయిలో చాటి చెప్పడం ద్వారా బీజేపీకి సవాల్ విసిరే ప్రయత్నం చేస్తున్నట్లుగా ప్రచారం చేసుకొనే అవకాశం ఉంది.

అయితే కేసీఆర్ ప్రయత్నాల కారణంగా బిజెపి కన్నా ఏపీలోని అధికార వైసీపీ మాత్రం రాజకీయంగా ఇబ్బందులు పడే అవకాశాలు స్పష్టంగా వ్యక్తం అవుతున్నాయి. పెద్ద ఎత్తున విశాఖలో ఉద్యమాలు జరుగుతున్నా పట్టించుకోకుండా, కేంద్ర ప్రభుత్వ ప్రయత్నానికి తన వంతు సహకారం అందిస్తున్నట్లు ప్రచారం పొందుతున్న వైఎస్ జగన్ ను కేసీఆర్ ప్రయత్నం ప్రజలలో చులకన కావించేందుకు దారితీయవచ్చని వైసిపి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా ఉండేందుకు పక్క రాష్ట్ర ప్రభుత్వం బిడ్డింగ్ వేసేందుకు ముందుకు వస్తుంటే.. ఏపీ ప్రభుత్వం మాత్రం నిమ్మకునీరెత్తకుండా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో తెలియకుండానే.. జగన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరగనుంది. కేసీఆర్ వేస్తున్న ఎత్తుగడ వల్ల బీజేపీ కంటే ఎక్కువగా జగన్‌ సర్కార్‌కు అసలైన సవాల్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాన్ని అడ్డుకొనేందుకు ఇదే రకమైన నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల ముందు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఒత్తిడి పెరుగుతుందని పలువురు భావిస్తున్నారు. పైగా, ఇటీవల ఎమ్యెల్సీ ఎన్నికలలో ఉత్తరాంధ్రలో వైసీపీకి తీవ్ర ప్రతికూలత ఎదురు కావడంతో పటు విశాఖపట్నంకు రాజధాని మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సానుకూలత వ్యక్తం కావడం లేదు.

ప్రస్తుత పరిస్థితులలో స్టీల్ ప్లాంట్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకొంటే గాని జగన్ ఉత్తరాంధ్రలో రాజకీయంగా నిలదొక్కుకోలేరని అధికార పార్టీ వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. కేసీఆర్, జగన్ మధ్య ఇప్పటికీ రాజకీయంగా అంతర్గత స్నేహమే ఉందని ఏపీలోని విపక్షాలు బలంగా నమ్ముతున్నాయి. మరోవైపు రాజకీయంగా తనతో కలిసి రాకపోయినా.. కేసీఆర్, వైసీపీ అధినేతను టార్గెట్ చేసిన సందర్భాలు లేవనే చెప్పాలి.

విశాఖ స్టీల్ పై జగన్ తో పాటు టీడీపీ, జనసేన, బిజెపి నేతలు సహితం కేంద్రాన్ని నిలదీసే పరిస్థితులలో లేకపోవడంతో కేసీఆర్ తీసుకొంటున్న చొరవ ఏపీలోని అన్ని రాజకీయ పక్షాలకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles