మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తామని చెప్పిన సీబీఐ హైకోర్టులోనే చెప్పడం, అవసరం అనుకుంటే అరెస్ట్ చేసుకోవచ్చని హైకోర్టు కూడా చెప్పడం జరిగి ఐదురోజులు అవుతున్నా ఇప్పటి వరకు కనీసం సిబిఐ నోటీసు కూడా ఇవ్వకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది.
అదే రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి రావడం వల్లనే సిబిఐ దూకుడు తగ్గించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో దూకుడుగా దర్యాప్తు జరుపుతూ అవినాష్ రెడ్డి కుటుంబాన్ని కీలక దోషిగా పేర్కొనడమే కాకుండా, తాడేపల్లి ప్యాలస్ వైపు కూడా ఆరోపణలు వచ్చేటట్లు చేశారని సీఎం జగన్ ఆగ్రహంగా ఉన్నట్లు చెబుతున్నారు. అందుకనే దర్యాప్తు అధికారిని మార్చని పక్షంలో ఎన్నికల సంవత్సరంలో తమకు ఇబ్బంది కాగలదని జగన్ ఢిల్లీలో ఆందోళన వ్యక్తం చేసిన్నట్లు భావిస్తున్నారు.
మరోవంక, ఈ కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటూ, అరెస్టై జైలు జీవితం గడుపుతున్న శివశంకర్ రెడ్డికి సతీమణి తులసమ్మ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేసు విచారణలో జరుగుతున్న జాప్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే సోమవారం నాటికి దర్యాప్తు ఏదశలో సిబిఐ నివేదికను సీల్డ్ కవర్లో అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
కాగా, నిజాయితీపరుడైన ఈ కేసు విచారణ అధికారిని మార్చాలని, ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి కోరినట్లుగా ప్రచారం జరుగుతోందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఈ కేసు పురోగతిని అడ్డుకునేందుకు హత్య కేసులో సూత్రధారులుగా అభియోగాలను ఎదుర్కొంటున్న వారు చేయని ప్రయత్నం అంటూ లేదని ఆయన విమర్శించారు.
వైయస్ వివేకా హత్య కేసు విచారణను తొలుత దీపక్ గౌర్ అనే అధికారి చేపట్టగా, ఆ తరువాత రామ్ సింగ్ కు విచారణ బాధ్యతలు అప్పగించారు. రామ్ సింగ్ ను ఎలాగైనా ఈ కేసు నుంచి తప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆయనపై కేసులు కూడా నమోదు చేసింది.
కేసు విచారణ అధికారిగా రామ్ సింగ్, హంతకుల అరెస్ట్ తో పాటు, సూత్రధారులు ఎవరో తేల్చే ప్రయత్నాన్ని చేస్తున్నారు. కేసు విచారణను తెలంగాణ హైకోర్టుకు మార్చిన తర్వాత విచారణలో పురోగతి పెరిగింది. తులసమ్మ కోరుకుంటున్నట్లుగా ఈ కేసు త్వరితగతిన విచారణ జరగాలంటే, సిబిఐ తుది చార్జిషీట్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంది.
వైయస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు గూగుల్ టేక్ అవుట్ ఆధారంగా న్యాయస్థానం దృష్టికి ఇప్పటికే సిబిఐ తీసుకెళ్ళింది. అందుకనే, వచ్చే సోమవారం లోగా సిబిఐ ఈ కేసులో కీలకమైన అడుగులు వేయక తప్పకపోవచ్చు.