వైఎస్సార్ కాంగ్రెస్ అంత గతిలేని స్థితిలో ఉందా?

Thursday, December 19, 2024

వైఎస్సార్ కాంగ్రెస్ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు గాను 18 మంది తమ పార్టీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. స్థానిక సంస్థలు, ఎమ్మెల్యేల కోటా కలిపి 16 స్థానాలకు ఎన్నికలు జరగబోతుండగా.. గవర్నరు కోటాలో ఎంపిక చేసిన వారిలో కలిపి 18 పేర్లను సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. స్థానిక సంస్థలు ఎమ్మెల్యేలు కోటాలో మెజారిటీలు చాలా స్పష్టంగానే ఉన్న నేపథ్యంలో వీరందరూ దాదాపుగా ఎన్నికైనట్టే.

 వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 18 పేర్లను గమనిస్తే బీసీ ఎస్సీ ఎస్టీలకు ఈ విడత అగ్ర ప్రాధాన్యం ఇవ్వదలుచుకున్నట్టుగా అర్థమవుతుంది. రెడ్డి కమ్మ సామాజిక వర్గాల నుంచి ఒక్కరేస్ మాత్రమే ఉన్నారు.  ప్రధానంగా మత్స్యకార వర్గానికి చెందిన వివిధ కులాలకు ప్రాతినిధ్యం దక్కింది. అయితే ఇద్దరి ఎంపికను గమనించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జాలి పుడుతుంది.  వైసిపి ప్రజాబలం పరంగా మరీ అంత గతి లేని స్థితిలో ఉన్నదా అనే అనుమానం కూడా కలుగుతుంది.  ఎందుకంటే సంవత్సరాల తరబడి పార్టీని నమ్ముకుని సేవ చేస్తున్న అనేక మందిని విస్మరించి,  కేవలం కులాల లెక్కలు చూసుకుని ఇద్దరిని ఎమ్మెల్సీలుగా చేయడం చిత్రమైన పరిణామం.  ఈ పదవులు కట్టబెట్టేప్పుడు కుల సమీకరణలు చూడడం మామూలే గాని,  వారిద్దరూ స్వతహాగా వైసీపీకి చెందిన వారు కాకపోవడమే ఇక్కడ విశేషం.  ఇప్పటికిప్పుడు వారిని తెలుగుదేశం నుంచి తీసుకువచ్చి,  ఆ వెంటనే వారికి ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టడం ఏమిటో పార్టీలో చాలామందికి మింగుడు పడడం లేదు.  తమ పార్టీ అంత గతిలేని స్థితిలో ఉన్నదా..?  తెలుగుదేశం నుంచి ఫిరాయించిన నాయకులు వస్తే తప్ప ఎమ్మెల్సీ కాగల స్థాయి వారు తమ పార్టీలో లేరా అని వారు తమలో తాము చర్చించుకుంటున్నారు.

 ఆ ఇద్దరిలో ఒకరు కైకలూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ కాగా.. రెండో వ్యక్తి శ్రీకాళహస్తి నియోజకవర్గం చెందిన సిపాయి సుబ్రహ్మణ్యం! వీరిద్దరూ మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు.  కైకలూరు నియోజకవర్గ ఇన్చార్జిగా మొన్నటిదాకా చాలా చురుగ్గా ఉన్న జయ మంగళ వెంకటరమణ కేవలం రెండు రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్సీ పదవి బేరం కుదిరిన తరువాత మాత్రమే ఆయన పార్టీలోకి వచ్చినట్టుగా అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఆ బేరసారాల పుకార్లను నిజం చేస్తూ ఇవాళ ఆయన పేరును ప్రకటించారు. 

రెండో వ్యక్తి సిపాయి సుబ్రహ్మణ్యం.  శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నిన్న మొన్నటిదాకా తెలుగుదేశం పార్టీలో రాష్ట్రస్థాయి పదవిలో కొనసాగుతున్నారు. వన్నెకుల క్షత్రియ (పల్లెరెడ్లు)  అనే కులానికి చెందిన సిపాయి సుబ్రమణ్యం పాదయాత్ర ప్రారంభానికి ముందు నారా లోకేష్ కుప్పంలో నిర్వహించిన ఆ కులం వారి సమావేశంలో కీలకంగా పాల్గొన్నారు. పాదయాత్రలో నారా లోకేష్ వెంట నడిచారు. బేరం ఎప్పుడు కుదిరిందో తెలియదు గానీ రెండు రోజుల కిందట హఠాత్తుగా తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి  తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆ సందర్భంలో వైసీపీలోకి వెళుతున్నట్టుగా కూడా చెప్పలేదు. సోమవారం ఉదయం తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవడం ,  ఆ వెంటనే సాయంత్రానికి ఎమ్మెల్సీగా జాబితాలో ఆయన పేరు చోటు చేసుకోవడం ఒకదాని వెనుక ఒకటి జరిగిపోయాయి.  

ఇంతకాలమూ పార్టీని తిట్టిపోసి, ఇప్పుడు పదవులకోసం వచ్చిన వారిని ఏకంగా ఎమ్మెల్సీలు చేసేయడం ఏమిటో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరీ అంత నాయకులకు గతిలేని స్థితిలో ఉన్నదని జగన్ అనుకుంటున్నారో ఏమిటో.. ఆ పార్టీ కార్యకర్తలకే అర్థం కావడం లేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles