రిపబ్లిక్ డే వేడుకలపై పరాభవంతో గవర్నర్.. కేసీఆర్ పై అక్కసు!

Friday, December 5, 2025

దేశంలో బిజెపియేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలలో గవర్నర్లు బిజెపి ఏజెంట్లుగా వ్యవహరిస్తూ ఉండడంతో ఆయా ముఖ్యమంత్రులతో ఘర్షణలు సర్వసాధారణమై పోయాయి. అయితే, కొన్ని మర్యాదలను మాత్రం ఆయా గవర్నర్లు, ముఖ్యమంత్రులు కూడా అధిగమించడం లేదు. కేరళలో సిపిఎం ప్రభుత్వంతో నిత్యమూ ఘర్షణలకు తలపడుతున్న గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అసెంబ్లీ ప్రసంగంలో మాత్రం పునరాయి విజయన్ ప్రభుత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తుతూ హుందాగా వ్యవహరించారు.

తమిళనాడులో గవర్నర్ ఆర్ ఎన్ రవి అసెంబ్లీలో ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగంలో కొన్ని మాటలను చదవకుండా, రాష్ట్రం పేరునే మార్చి చదువుతూ తొలుత వివాదం సృష్టించినా, ఆ తర్వాత సర్దుకున్నారు. అయితే తెలంగాణాలో మాత్రం గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ ఓ రాజకీయ నాయకురాలి మాదిరిగా ప్రోటోకాల్ పాటించకుండా తనను సీఎం కేసీఆర్ అవమానిస్తున్నారని అంటూ నిత్యం విమర్శలు గుప్పిస్తూ సర్దుబాటు చేసుకోలేని పరిస్థితులకు చేరుకున్నట్లు కనిపిస్తున్నది.

తాజాగా, ఈ ఏడాది అయినా కరోనా లేకపోవడంతో పెరేడ్ గ్రౌండ్స్ లో అట్టహాసంగా రిపబ్లిక్ దినోత్సవాలు జరిపితే పాల్గొనాలని గవర్నర్ తమిళసై ఉత్సాహపడ్డారు. అయితే ప్రభుత్వం చివరివరకు ఈ విషయమై మాట్లాడకుండా, చివరకు రాజ్ భవన్ కె ఉత్సవాలను పరిమితం చేశారు. దానితో గవర్నర్ అసహనం వ్యక్తం చేశారు. ఈ లోగా ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించగా కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడపాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.

అయితే, ఎక్కడ ఉత్సవాలు జరపాలనే విషయాన్ని హైకోర్టు స్పష్టం చేయకుండా,  రాష్ట్ర ప్రభుత్వానికి వదిలివేయడంతో ప్రభుత్వం యధావిధిగా రాజ్ భవన్ లోనే జరిపింది. హైకోర్టు ఆదేశంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నా సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఎవ్వరు పాల్గొనలేదు. ఈ పరిణామాలతో ఓ విధంగా అవమానకరంగా గవర్నర్ భావించిన్నట్లున్నారు. తన ప్రసంగంలో కేసీఆర్ పై తన అక్కసు అంతా వెళ్లగక్కారు.

ఈ సందర్భంగా రాజ్ భవన్ మర్యాదలను సహితం ఆమె అధిగమిస్తూ, ఓ సాధారణ రాజకీయ నాయకురాలిగా కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఒక వంక కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, తాను కూడా రాష్ట్రాభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నామంటూ చెబుతూనే తెలంగాణాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో రోజుకు 22 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని పేర్కొంటూ రైతుల ఆత్మహత్యలను ప్రస్తావించారు.

ఇక, కొందరికి తాను నచ్చకపోయినా.. తెలంగాణ వాళ్లు అంటే తనకు ఇష్టమని అంటూ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు.  “తెలంగాణ అభ్యున్నతిలో నా పాత్ర తప్పకుండా ఉంటుంది. హార్డ్‌వర్క్, నిజాయితీ, ప్రేమ.. నాకున్న పెద్ద బలం. కొంత మందికి నేను నచ్చకపోవచ్చు. కానీ నాకు తెలంగాణ వాళ్లు అంటే ఇష్టం. అందుకే ఎంత కష్టమైనా పని చేస్తా” అంటూ కేసీఆర్ ప్రభుత్వంపై సవాల్ అన్నరీతిలో మాట్లాడారు. 

“అభివృద్ధి అంటే భవనాల నిర్మాణం కాదు.. జాతి నిర్మాణం” అంటూ పరోక్షంగా కేసీఆర్ ప్రభుత్వం బ్రహ్మాండంగా నూతన సచివాలయ భావన నిర్మాణం చేయడాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. అంతేకాదు,  “కొందరికే ఫామ్‌హౌస్‌లో కాదు.. అందరికి ఫామ్‌లు కావాలి” అంటూ నేరుగా కేసీఆర్ లక్ష్యంగా విమర్శలు చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles