‘‘మీరందరూ నా జట్టు.. మనందరమూ కలిసి మళ్లీ పోటీచేయాలని, మళ్లీ గెలవాలనే నేను కోరుకుంటాను’’ అని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలతో సమావేశాలు పెట్టుకున్న ప్రతి సందర్భంలోనూ అంటూ ఉంటారు. వారసులకు టికెట్ అడిగినా, తాము తప్పుకుంటాం అని చెప్పినా.. జగన్ ఈ మాట వల్లిస్తారు. అదే సమయంలో.. నా సర్వేలు నేను చేయిస్తున్నాను. అంతిమంగా సర్వేలే ఫైనల్.. సర్వేల్లో ప్రతికూలంగా వస్తే టికెట్ ఇచ్చేది లేదు.. అని కూడా అంటూ ఉంటారు. ఆయన ఎవరెవరికి టికెట్ నిరాకరిస్తారో ఆయన మనసులో ఇప్పటికే ఓ స్పష్టత ఉండొచ్చు. ఆ సంగతి ఎలా ఉన్నప్పటికీ చాలా మంది ఎమ్మెల్యేల్లో మాత్రం.. ఈసారి టికెట్ దక్కదేమో అనే భయం బాగా పట్టుకుంది. అలాంటి వారిలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ కూడా ఉన్నారు.
వెలంపల్లికి ఈసారి ఎమ్మెల్యే టికెట్ దక్కుతుందా లేదా అనే భయం బాగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా బెజవాడలో జరిగిన ఒక చిన్న సంఘటన ఈ విషయాన్ని నిరూపిస్తోంది. ఓ కార్యక్రమం వద్ద వెలంపల్లి శ్రీనివాస్, మరో ఎమ్మెల్యే సామినేని ఉదయబాను పరస్పరం ఎదురు పడ్డారు. ఉదయభానును చూడగానే వెలంపల్లి ఒక్కసారిగా ఫైర్ అయిపోయారు. ‘‘నా నియోజకవర్గం నాయకుడిని సీఎం జగన్ వద్దకు నువ్వు తీసుకెళ్తావా.. నువ్వు అంత పోటుగాడివి అయిపోయావా’’ అంటూ ఫైర్ అయ్యారు. సామినేని ఏం ఊరుకోలేదు. ‘‘నేను నీలాగా పార్టీలు మార్చే ఊసరవెల్లిని కాను’’ అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇంతకూ ఏం జరిగిందంటే.. వెలంపల్లి నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ఆకుల శ్రీనివాస్ అనే నాయకుడు ఇటీవల సీఎం జగన్ ను కలిశారు. కుమార్తె పెళ్లికి పిలవడానికి వెళ్లినట్లుగా చెప్పుకుంటున్నారు. అయితే ఆయనను సామినేని ఉదయబాను సీఎం వద్దకు స్వయంగా తీసుకెళ్లడం వెలంపల్లికి కాకపుట్టించింది. సదరు ఆకుల శ్రీనివాస్ అనే వ్యక్తి, 2014లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేసి, వెలంపల్లితోపాటు ఓడిపోయారు. ఇప్పుడు సామినేని ని వెంటబెట్టుకుని ఆకుల శ్రీనివాస్ వెళ్లి సీఎం జగన్ ను కలిశారనగానే.. వెలంపల్లికి గుబులు పట్టుకుంది. అసలే రెండున్నరేళ్ల తర్వాత జగన్ తన మంత్రి పదవిని పీకేశారు. మధ్యలో తనకు వార్నింగులు కూడా ఇచ్చారు. ఈసారి ఎన్నికల వేళకి తన ఎమ్మెల్యే సీటు కూడా పోతుందని ఆయన భయపడుతున్నారు. అందుకే ఒక కార్యక్రమంలో సామినేని ఎదురుపడగానే ఫైర్ అయ్యారు. ఇద్దరూ నాయకులూ ఒకరి పరువు మరొకరు తీసేసుకునేలా దూషించుకుని జనం దృష్టిలో పలచన అయ్యారు.
వెల్లంపల్లికి టికెట్ దక్కదనే భయం పట్టుకుందా?
Thursday, November 14, 2024