కొండగట్టులో ఆంజనేయస్వామిని దర్శించుకుని తన వారాహి వాహనానికి పూజలు నిర్వహించిన జనసేన అధినేత తెలంగాణాలో అధికారంలోకి రాబోతుందని భరోసా వ్యక్తం చేస్తున్న బిజెపికి షాక్ ఇచ్చారు. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నామని చెబుతూనే తెలంగాణలో తాము పరిమితస్థాయిలోనే పోటీ చేస్తామని వెల్లడించారు.
ఈ విధంగా ప్రకటించడం ద్వారా బిఆర్ఎస్ వ్యతిరేక ఓటర్లను ఆకట్టుకోవడంలో బిజెపికి పోటీదారునిగా నిలవబోతున్నామనే సంకేతం ఇచ్చారు. తెలంగాణ సమస్యలపై లోతైన అధ్యయనం చేసిన తర్వాతనే పోటీపై నిర్ణయం తీసుకుంటామని, ఏడు నుంచి 14 పార్లమెంటు స్థానాల్లో తెలంగాణ ప్రాంతంలో పోటీ చేస్తామని పవన్ తెలిపారు. అంటే ఒక విధంగా మొత్తం 19 స్థానాలు ఉండగా మెజారిటీ స్థానాలలో పోటీకి వచ్చే అవకాశం ఉన్నట్లు తేల్చి చెప్పినట్లయింది.
అదే విధంగా, తెలంగాణలో జనసేనకు కనీసం 10 మంది ఎమ్మెల్యేలు ఉండాలని చెప్పడం ద్వారా సుమారు 40 సీట్లలో పోటీ చేయవచ్చనే అభిప్రాయాన్ని వెల్లడించారు. అదే జరిగితే, టిడిపి మిగిలిన నియోజకవర్గాలలో పోటీచేసే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు తెలంగాణాలో బిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీగా భావిస్తున్నారు.
టీడీపీ-జనసేన రంగంలోకి వస్తే చతుర్ముఖ పోటీ కాగలదు. అదే జరిగితే, అధికార పార్టీకే అనుకూలంగా మారే అవకాశంగా ఉంటుంది. ఈ పోటీలో బిజెపి కనీసం రెండో స్థానంలో ఉంది, ప్రధాన ప్రతిపక్ష హోదా సంపాదించలేక, నాలుగో స్థానంకు పరిమితమైన పక్షంలో 2024 లోక్ సభ ఎన్నికలలో ప్రస్తుతం ఉన్న నాలుగు లోక్ సభ సీట్లను కూడా బిజెపి కోల్పోయే ప్రమాదం ఉంది.
తాను ప్రతి నియోజకవర్గంలో తిరుగుతానని పేర్కొంటూ తెలంగాణలో తమతో ఎవరైనా పొత్తుకు వస్తే స్వాగతిస్తామని తెలిపారు. మంచి భావజాలం ఉన్న పార్టీలతోనే జనసేన పొత్తు ఉంటుందని స్పష్టం చేయడం ద్వారా బిజెపితో తమ పొత్తు ఏపీ వరకే పరిమితం అనే సంకేతం ఇచ్చారు.
ఏపీలో కూడా తమకు మూడు ఆప్షన్లు ఉన్నాయని చెప్పడం గమనార్హం. “అప్షన్ 1 బీజేపీతో ఉన్నాం.. ఆప్షన్ 2 బీజేపీ కాదంటే ఒంటరిగా వెళతాం. ఆప్షన్ 3 కొత్త పొత్తులకు కూడా సిద్ధంగా ఉన్నాం” అని ఆయన తెలిపారు. పైగా, ఎన్నికలకు వారం ముందే పొత్తులపై స్పష్టత ఉంటుందని పేర్కొనడం ద్వారా బిజెపితో సంబంధం లేకుండా తమ ఎన్నికల వ్యూహాలు ఉంటాయని తేల్చి చెప్పిన్నట్లు అయింది.
ఏపీలో వైఎస్ జగన్ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తామని పవన్ స్పష్టం చేస్తున్నారు. ఏపీలో జనసేన, టిడిపిలు పొత్తు గురించి ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో చర్చలు పూర్తయ్యాయనేకధనాలు ఏపీ రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. ఒకవేళ ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటే.. ఆ రాజకీయ స్నేహం తెలంగాణలోనూ కొనసాగే అవకాశం ఉంటుంది.
టిడిపి, జనసేన కలిసి తెలంగాణాలో పోటీచేస్తే వారికెన్ని సీట్లు వస్తాయో ఏమో గాని, ఎక్కువగా నష్టపోయెడిది బిజెపి మాత్రమే కాగలదు. పోరాటాల గడ్డ తెలంగాణలో పుట్టిన పార్టీ జనసేన అని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పేర్కొనడం ఒక విధంగా బిజెపికి హెచ్చరిక పంపడం వంటిదే అని పరిశీలకులు భావిస్తున్నారు. టిడిపి, జనసేనలతో కలసి ఏపీలో పొత్తులకు సిద్దపడక పోతే తెలంగాణాలో మీ రాజకీయ ఆశలపై నీళ్లు చల్లుతామని బెదిరిస్తున్న ధోరణిలో ఆయన మాటలు కనిపిస్తున్నాయి.