ఆమె సీనియర్ ఐఏఎస్ అధికారిని. చాలాకాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయంలోనే పనిచేస్తున్నారు. ప్రస్తుతం ప్రత్యేక కార్యదర్శి హోదాలో పనిచేస్తున్నారు. ఆమె భర్త ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి. అయితే, ఆమె రాత్రి పొద్దుపోయాక ఓ అపరిచిత వ్యక్తి ఇంటిలోకి దర్జాగా చొరబడి వచ్చేసరికి ఆమె భయపడ్డారు. గాబరా చెందారు. సహాయం కోసం కేకలు వేశారు.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్న ఇంట్లోనే ఈ విధంగా జరిగింది. ఆ తర్వాత ఆడవారెవ్వరు, ఎంత భద్రతా ఉన్నప్పటికీ తలుపులు వేసుకోకుండా ఇంట్లో ఉండవద్దంటూ ఆమె సలహా ఇచ్చారు. హైదరాబాద్ లోని పోష్ లొకాలిటీలో ఈ విధంగా జరగడం తెలంగాణాలో శాంతిభద్రతలు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో వెల్లడి చేస్తుంది.
ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ కు చేదు అనుభవం ఎదురైంది.. మేడ్చల్ జిల్లాకు చెందిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్‌కుమార్ రెడ్డి జూబ్లీ హిల్స్ లోని అమె నివాసానికి వెళ్లి హంగామా సృష్టించాడు. అర్థరాత్రి వేళ మహిళా ఐఏఎస్ అధికారి ఇంట్లో చొరబడ్డాడు. ఆమె పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు.
ఎవరు నువ్వు..? ఎందుకొచ్చావు..? అని గట్టిగా ప్రశ్నించి సీరియస్ అవ్వడంతో డ్యూటీ విషయంలో మాట్లాడేందుకు వచ్చానని చెప్పాడు. దీంతో మహిళా ఐఏఎస్ కేకలు వేయడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది డిప్యూటీ తహసీల్దార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఆనంద్‌కుమార్ రెడ్డితో పాటు అతని డ్రైవర్‌ను కూడా భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు.
వారిపై సెక్షన్ 458r/w34 కింద జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై స్పందించిన స్మితా సబర్వాల్ ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. “రాత్రి నాకు ఊహించని సంఘటన ఎదురైంది. అత్యంత బాధాకరమైన ఘటన జరిగింది.. రాత్రి నా ఇంట్లోకి ఓ వ్యక్తి చొరబడ్డాడు.. అప్రమత్తతో నా ప్రాణాలు కాపాడుకున్నా.. మీ ఇంటికి తాళాలు వేసుకోండి… తలుపు తాళాలను తనిఖీ చేసుకోండి.. అత్యవసర పరిస్థితిలో డయల్ 100కు కాల్ చేయండి” అంటూ తోటి మహళలకు సలహా యిస్తూ పోస్టు పెట్టారు.
స్మితా సబర్వాల్ వ్యాఖ్యాలు రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు అద్దం పడుతున్నాయని పేర్కొంటూ టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై ఎద్దేవా చేశారు. సిఎం కార్యదర్శి ప్రాణాలకే రక్షణ లేదంటే కెసిఆర్ ఎవరిని కాపాడాతారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇంటికి తాళాలు వేసుకొని లోపల భయం భయంగా బతకండని స్మితా సబర్వాల్ అనడం రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదనడానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.