తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు వెళ్లారు. రెండువేల కోట్ల రూపాయల పెట్టుబడులతో పారిశ్రామికవేత్తలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ ఫోటోలన్నీ తెలంగాణ పత్రికల పతాకశీర్షికల్లో వచ్చాయి. వీటిని చూసి ఆంధ్రప్రజలకు కడుపుమండి ఉంటుంది. అసలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామికీకరణ పరంగా ఏం జరుగుతోందో తెలియడం లేదు. ప్రభుత్వం ఎలా సమర్థించుకోవాలని చూస్తున్నప్పటికీ జగన్ సర్కారు ఏర్పడిన తర్వాత.. రాష్ట్రానికి పెట్టుబడులు రావడంలేదు. ఉద్యోగావకాశాలు ఏర్పడడం లేదు. అలాంటి సమయంలో పెట్టుబడులు రాబట్టడానికి ఎక్కడ చిన్న అవకాశం కనిపించినా ప్రభుత్వం శ్రద్ధ చూపించాలి. ఎగబడి అక్కడకు వెళ్లాలి. పారిశ్రామికవేత్తలతో మాట్లాడాలి. రాష్ట్రానికి మేలు చేయాలి.. అని ప్రజలు కోరుకుంటారు. కానీ తమాషా ఏంటంటే.. దావోస్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున అసలు ప్రతినిధులు ఎవ్వరూ వెళ్లనే లేదు.
సాధారణంగా దావోస్ లో జరిగే ఈ ఫోరం ప్రపంచంలోనే అతిపెద్దది. ప్రభుత్వాల అధినేతలే స్వయంగా ఈ సదస్సుకు వస్తుంటారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిసారీ వెళ్లేవారు. పెట్టుబడులను రాబట్టేవారు. గత ఏడాది జగన్ కూడా వెళ్లారు. కానీ ఫలితం పెద్దగా లేదు. ఈ సంవత్సరం అసలు ఏపీ ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. ప్రతిసారీ వెళ్తున్న తెలంగాణ తరఫున ఈ సారి కూడా కేటీఆర్ వెళ్లి పెట్టుబడులు రాబట్టారు. ఈ నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వానికి దావోస్ ఆహ్వానమే రాలేదని తెలుగుదేశం ఎద్దేవా చేసింది.
మంత్రి గుడివాడ అమర్ నాధ్ కు వీరి విమర్శల పట్ల కోపం వచ్చింది.ప్రెస్ మీట్ పెట్టి మరీ.. పిలుపు మాకు కూడా వచ్చింది.. గత నవంబరులోనే వచ్చింది అంటూ లెటరు కూడా చూపించారు. ఇక్కడే వస్తోంది అసలు సమస్య. పిలుపు వస్తే మరి ఎందుకు వెళ్లలేదు. ఇది అచ్చంగా ప్రభుత్వ నిర్లక్ష్యం కదా అనేది ప్రజల సందేహం.మార్చిలో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సు పెట్టాలని అనుకుంటున్నారు గనుక.. ఆ ఏర్పాట్లలో పడి దావోస్ సదస్సు వద్దని అనుకున్నారట. గుడివాడ మాటలు తలాతోకా లేకుండా ఉన్నాయి. మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒలకబోసుకున్నట్టుగా కూడా ఉన్నాయి. మార్చిలో వీరు పెట్టే గ్లోబల్ సదస్సులో పెట్టుబడుల వెల్లువ వస్తే రావొచ్చు గాక.. కానీ, దావోస్ సదస్సుకు కూడా వెళ్లడం వల్ల నష్టమేమీ లేదు కదా. వీరు పిలిచే సంస్థలే కాకుండా, ప్రపంచవ్యాప్త ప్రముఖ సంస్థలెన్నో అక్కడ ఉంటాయి కదా.. పెట్టుబడి అవకాశాలు పెరుగుతాయి కదా అనేది ప్రజల సంశయం. ఇది జగన్ నిర్లక్ష్యానికి నిదర్శనం అని జనం అనుకుంటున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకోవడం కాకపోవచ్చు గానీ.. రావాలనే శ్రద్ధ లేకపోవడం అంటున్నారు.
జగన్ నిర్లక్ష్యం చాటిచెప్పిన గుడివాడ!
Friday, December 27, 2024